సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం జూలై 5 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ వంటి నటీనటులు నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతమందించాడు. ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ మూవీ ఇన్స్పిరేషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది నందిని రెడ్డి. టీజర్ విడుదలయ్యే వరకూ ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు.. కానీ టీజర్ విడుదలయ్యాక ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ విడుదలయ్యాక అవి మరింత బలపడ్డాయి. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు వేగవంతం చేసారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది… “ఈ సినిమా మొదలవ్వడానికి ముందే సమంతకు, నాకు మధ్య ఓ డీల్ జరిగింది. ‘నువ్వేదైనా తప్పు చేస్తుంటే నేను చెబుతా… నేనేదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పు.. మనిద్దరి మధ్య ఈగో అనేది అడ్డురాకూడదు’ అనేది ఆ ఒప్పందం. ఈ సినిమాకు సంబంధించి సమంత నటిగా మాత్రమే కాకుండా అన్ని బాధ్యతలూ దగ్గరుండి చూసుకున్నారు. ఇక దర్శకురాలిగా అన్నిరకాల సినిమాలు నాకు చేయాలని ఉంది. సమంతతో చేసిన ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ సినిమా ప్రభావంతో ఇంట్లో.. మా అమ్మ మీద కసురుకోవడం కూడా తగ్గించాను” అంటూ చెప్పుకొచ్చింది నందినీ రెడ్డి.