న్యూక్లియాతో పనిచేయడం ఆనందంగా ఉంది : శృతి హాసన్

విశ్వనటుడు కమలహాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ గాయనిగా, నటిగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకుంది. అపజయాలు పలకరించినప్పుడు.. అనేక సినిమాలు ఒప్పుకున్న ఈ బ్యూటీ, విజయాలు వరిస్తున్న సమయంలో నటనకు దూరంగా ఉంటోంది. కాటమ రాయుడు తర్వాత తెలుగులో కనిపించలేదు. తమిళ దర్శకుడు సుందర్ సి వందల కోట్లతో తీయాలన్న సంఘమిత్ర నుంచి బయటికి వచ్చింది. తండ్రితో కలిసి చేస్తున్న శెభాష్ నాయుడు తప్ప ఆమె ఏ ప్రాజక్ట్ కి సైన్ చేయలేదు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి శృతి హాసన్ ఓ ప్రత్యేక పాట రికార్డింగ్ కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ న్యూక్లియా (ఉద్యాన్ సాగర్)తో కలిసి పనిచేస్తోంది. ఆమె ప్రతిభని గుర్తించిన న్యూక్లియా అభినందించక ఉండలేకపోయారు.

“గాయనిగా, రచయిత్రిగా శృతి రాణిస్తున్నారు. ఈ ట్రాక్(పాట) లిరిక్స్‌ను ఆమె రాశారు. అద్భుతంగా ఉండబోతోంది” అని న్యూక్లియా ప్రసంశలు గుప్పించారు. దీంతో శృతి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ‘‘ఈ బృందంతో కలిసి పనిచేయడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. మా ట్రాక్ సృజనాత్మకతతో నిండి ఉంటుందని భావిస్తున్నా. న్యూక్లియాతో పనిచేయడం నా అదృష్టం. ప్రజల్ని ఆయన మెప్పించిన తీరు అద్భుతం. ఆయనకు ఎప్పుడూ నేను అభిమానినే. ఇది నాకొక మధుర జ్ఞాపకం కాబోతోంది’’ అని వెల్లడించింది. నటిగా దక్షిణాదిన పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus