టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లు కుదరినట్లే కుదిరి ఆ తర్వాత ఎందుకో ఆగిపోతుంటాయి. లేదంటే ఆ కాంబోలో ఒకరు మధ్యలో ప్రయాణం ఆపేస్తుంటారు. అలాంటి కాంబినేషన్లలో నాగ్ అశ్విన్ – సింగీతం శ్రీనివాసరావు ఒకటి. అవును, ఇది నిజమే. గతంలో ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా కోసం పని చేయాల్సి ఉంది. నిజానికి ఇద్దరూ కలసి పని ప్రారంభించారు కూడా. అయితే ఏమైందో ఏమో మధ్యలో సింగీతం ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తారు అని చెబుతున్నారు.
ముందుగా గతంలో మిస్ అయిన కాంబో సినిమా గురించి చూసి ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించి చూద్దాం. నాగ్ అశ్విన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించి సింగీతం శ్రీనివాసరావును ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించారు. ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా సినిమా కోసం తన ఆలోచనలు, సూచనలు ఇస్తూ వచ్చారు. అయితే అనుకోకుండా ఆ సినిమా నుండి ఆయన తప్పుకున్నారు. నాగ్ అశ్విన్ ఒక్కరే ఆ సినిమాను ముగించారు. అయితే ఏమైంది అనేది అప్పుడు చెప్పలేదు.
అయితే, అలా మిస్ అయిన కాంబోను ఇప్పుడు నిర్మాతగా మారి ప్రేక్షకులకు అందించాలని నాగ్ అశ్విన్ అనుకుంటునర్నారట. సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో నాగ్ అశ్విన్ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. మరి ఆ సినిమా కొత్త బ్యానర్‌లో ఉంటుందా లేక ఆయన భార్యకు చెందిన స్వప్న సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తూ ఆయన సమర్పకుడిగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో అనుదీప్ దర్శకత్వంలో ‘జాతిరత్నాలు’ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.
మరి సింగీతం శ్రీనివాస రావు ఎలాంటి కథతో ముందుకు వస్తారు, ఇప్పటి తరానికి కనెక్ట్ అయ్యే కథతోనే వస్తారా అనేది చూడాలి. అయితే ఆయన ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడే రాబోయే తరాన్ని ఉద్దేశించి సినిమాలు తెరకెక్కించారు. అలాంటిది ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ కథతో రావొచ్చని టాక్.