సినిమానిడివి లో తేడా లేనప్పటికీ నిర్మాణ వ్యయం బట్టి చిన్న, పెద్ద అంటూ ట్రేడ్ వర్గాలవారు డివైడ్ చేస్తుంటారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో రూపొందే వాటిని పెద్ద సినిమాలని పిలవగా, కొత్తనటీనటులతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే ఫిలిమ్స్ ని చిన్నవి అంటూ చిన్న చూపు చూస్తారు. ఇటువంటి చిన్న చిత్రాలు అనేక సార్లు దిమ్మదిరిగే కలక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. అలా టాలీవుడ్ లో 21 శతాబ్దంలో రికార్డులు నెలకొల్పిన మూవీస్ పై ఫోకస్…
చిత్రంకొత్త నటీ నటులు, టెక్నీషియన్లతో రామోజీ రావు చేసిన సాహసం “చిత్రం”. ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమ కథ చిత్రం యువతని బాగా ఆకర్షించింది. కేవలం 45 లక్షలతో నిర్మితమైన ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయి కోట్లను రాబట్టి చిన్న చిత్రాల నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది.
ఐతేనలుగురు కుర్రోళ్లతో కిడ్నాప్ కథను అందంగా మలిచి చంద్రశేఖర్ యేలేటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ మూవీ భారీ లాభాలతో పాటు జాతీయ అవార్డు ని తెచ్చి పెట్టింది. కెమెరా మెన్ సెంథిల్ కుమార్ కి ఐతే మంచి బ్రేక్ ని ఇచ్చింది.
ఆనంద్శేఖర్ కమ్ముల మెగా ఫోన్ నుంచి వచ్చిన మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ ని పక్కన పెట్టి అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. మంచి కథలను ప్రోత్సహించే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలి సారి ఆర్ధిక సహకారం అందించిన కమర్షియల్ సినిమా ఇదే కావడం విశేషం.
హ్యాపీ డేస్శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో యూత్ ఫుల్ మూవీ హ్యాపీ డేస్. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. పెద్ద చిత్రాలకు పోటీగా ఈ సినిమా కలెక్షన్లను వసూలు చేసింది. లెక్కలేనన్ని అవార్డులను కైవసం చేసుకుంది.
అష్టా చమ్మాఒక అందమైన కథకి చలాకి నటులు తోడైతే ఎలా ఉంటుందో మోహన కృష్ణ ఇంద్ర గంటి తెరకెక్కించి
అష్టా చమ్మా చిత్రం ద్వారా చూపించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాని, కలర్ స్వాతి, అవసరాల శ్రీనివాస్ లను హీరో హీరోయిన్లుగా మలిచి కాసుల వర్షం కురిపించారు.
ఈ రోజుల్లో ..యువత ఈ రోజుల్లో ఎలా ఉందో అనే కథాంశంతో మారుతి మలిచిన చిత్రం “ఈ రోజుల్లో ..”. 5 డి కెమెరాతో 50 లక్షల వ్యయంతో నిర్మించిన మూవీ 12 కోట్లు వసూలు చేసి.. డిజిటల్ ఫార్మేట్ మూవీస్ ని ప్రోత్సహించింది.
అలా మొదలయింది..నాని, నిత్యా మీనన్ లు జంటగా నటించిన అలా మొదలయింది.. రిలీజ్ అయినప్పుడు చిన్న చిత్రాలు జాబితాలో కలిసి పోతుందిలేనని అందరూ అనుకున్నారు. కానీ కలక్షన్ల సునామీ సృష్టించి పెద్ద చిత్రాలకంటే ముందు నిలబడింది. 25 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది.
అవునుతక్కువ చిత్రాలను తెరకెక్కించడంలో నేర్పరి అయిన రవిబాబు నుంచి వచ్చిన మరో లో బడ్జెట్ ఫిల్మ్ “అవును”. హారర్ థ్రిల్లర్ జాన్రా లో రూపొందిన ఈ చిత్రం భారీ కలక్షన్లు రాబట్టడంతో, ఇందుకు సీక్వెల్ కూడా చేశారు.
ఉయ్యాలా జంపాలాబావ మరదళ్ల మధ్య ప్రేమ కథ.. అందరికీ తెలిసిన స్టోరీ. ఒక ఊరు, రెండు ఇల్లు.. కొన్ని గొడవలు అంతే. రొటీన్ స్టోరీని చాలా ఫ్రెష్ గా విరించి వర్మ తెరకెక్కించారు. ఈ ప్రేమ కథ కుటుంబ సభ్యులందరినీ ఆకట్టుకుంది. బిగ్ హిట్ అందుకుంది.
ఊహలు గుసగుసలాడేనటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మారి చేసిన చిత్రం ఊహలు గుసగుసలాడే. సూపర్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. 2.5 కోట్లతో నిర్మితమయిన ఈ మూవీ 27 కోట్లు రాబట్టి చిన్న సినిమాలపై చిన్న చూపు తగదని నిరూపించింది.
క్షణంఒక పాప తప్పిపోయింది.. ఆమెను రక్షించాలి.. సింపుల్ లైన్. కానీ కథలో ఎన్ని ట్విస్టులు.. చివరి వరకు కొనసాగిన సస్పెన్స్ “క్షణం” చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది. కోటి రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా రూ. 8 కోట్లు వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది. కథలో పట్టుంటే స్టార్ హీరో అవసరం లేదని ఈ చిత్రం మరో సారి చాటింది.
పెళ్లిచూపులువిజయ్ దేవరకొండ, రీతూ లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేరింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన పెళ్లిచూపులు విజయం చిన్న చిత్రాల నిర్మాతలకు మంచి బలాన్ని ఇచ్చింది.