హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రజలకు పరిచయమైన దానికంటే ఎక్కువగా ట్విట్టర్-ఫేస్ బుక్ లో ఉన్న ఫేక్ ఎకౌంట్స్ గురించి వారి అసభ్యకరమైన ట్రోలింగ్స్ గురించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఎక్కువగా నెటిజన్ల నోట్లో నానిన పేరు “శివబాలాజీ”. ఇటీవల “బిగ్ బాస్” మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన శివబాలాజీ, ఆ షోలో పార్టీసిపేట్ చేయడానికి కంటే ముందు నటించి, నిర్మించిన చిత్రం “స్నేహమేరా జీవితం” 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రెండేళ్లకు పైనే ల్యాబ్ లో ఉండిపోయి ఎట్టకేలకు నేడు (నవంబర్ 17న) విడుదలవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ : మోహన్ (శివబాలాజీ), చలపతి (రాజీవ్ కనకాల) ప్రాణ స్నేహితులు. మోహన్ పై ఎవడైనా చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి నరికేయడానికైనా సిద్ధపడే తెగువ చలపతిది, అలాగే చలపతి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అలా అన్నోడి కంఠం కోసేసేంత కోపం మోహన్ ది. చలపతి టింబర్ బిజినస్ తోపాటు అతడి పర్సనల్ వర్క్స్ కూడా చూసుకొంటూ చేదోడు వాదోడుగా ఉంటుంటాడు మోహన్. దాంతోపాటే.. అదే ఊర్లో ఉండే ఇందిర (సుషుమ యార్లగడ్డ)ను ప్రేమిస్తుంటాడు. మిగతా విషయాల్లో ఎంత పక్కాగా ఉన్నా.. తన ప్రేమను ఇందరకు వ్యక్త పరిచడంలో మాత్రం తెగ భయపడిపోతుంటాడు మోహన్. సరిగ్గా తన ప్రేమను వ్యక్తపరుద్దామనుకొన్న రోజే మోహన్ కి ఇందిరా-చలపతి గురించి ఓ నమ్మలేని నిజం తెలుస్తుంది. దాంతో మోహన్-చలపతిల మధ్య చిచ్చు రేగుతుంది. తాను ఎంతగానో నమ్మిన చలపతి తనను మోసం చేశాడని భావించిన మోహన్.. అతడ్ని అన్నీ విధాలుగా నాశనం చేయాలని పూనుకుంటాడు. ఇంతకీ మోహన్-చలపతిల నడుమ వచ్చిన విబేధాలేమిటి? ఇందిర ప్రేమను మోహన్ పొందగలిగాడా? చివరికి “స్నేహం” విలువ మోహన్-చలపతిలో ఎవరు అర్ధం చేసుకొన్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం “స్నేహమేరా జీవితం” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : మోహన్ పాత్రలో కోపిష్టి వ్యక్తిగా శివబాలాజీ సహజమైన నటనతో ఆకట్టుకోగా.. రాజీవ్ కనకాల స్నేహితుడి పాత్రలో అలరించాడు. 1980కి తగ్గట్లుగా ఇద్దరి వస్త్రధారణ బాగుంది. సుషుమ యార్లగడ్డకి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా పర్వాలేదనిపించుకుంది. సత్య “రంగా” పాత్రలో ఆకట్టుకోవడంతోపాటు అక్కడక్కడా నవ్వించాడు కూడా. ఇంకా సినిమాలో బోలెడన్ని క్యారెక్టర్లు ఉన్నప్పటికీ.. సరైన క్యారెక్టరైజేషన్స్ లేకపోవడం వల్ల వాళ్ళెవరూ రిజిష్టర్ అవ్వరు.
సాంకేతికవర్గం పనితీరు : సినిమాలో సునీల్ కశ్యప్ సంగీతం, నమ్రత జలాది కాస్ట్యూమ్స్ మాత్రమే 1980 ఫీల్ ను తీసుకువస్తాయి. సినిమాటోగ్రాఫర్ యెల్లో టింట్ ను వాడడం మినహా ఏ ఒక్క సన్నివేశంలోనూ ఆ ఫీల్ ను తీసుకురాలేకపోయాడు. క్యారెక్టరైజేషన్స్ లో క్లారిటీ లేకపోవడం వల్ల ఎడిటర్ ఎంత కష్టపడి ఎడిట్ చేసినా.. అది స్క్రిప్ట్ చదివిన చిత్రబృందానికి తప్ప ఎవరికీ అర్ధంకానట్లే ఉంటుంది. 1980 కాలంలో చిత్రాన్ని తెరకెక్కిద్దామని ఫిక్స్ అయిన డైరెక్టర్ మహేష్ ఉప్పుటూరి కథను కూడా అప్పటి తరానికి చెందినది తీసుకోవడం గమనార్హం. పోనీ కథలో కంటెంట్ లేదు కాబట్టి స్క్రీన్ ప్లేలో ఏదైనా జాగ్రత్త తీసుకొన్నాడా అంటే అదీ లేదు. అసలు చలపతి మీద మోహన్ అనుమానం పడడానికి మళ్ళీ అది క్లియర్ అవ్వడానికి పెద్ద రీజన్స్ కనిపించవు. మరీ ఇంత సీల్లీ రీజన్ కోసం ఒకర్నొకరు చంపేసుకోవాలనుకొన్నారా అనిపిస్తుంది. అసలు ఒక సినిమాలో రెండు ఐటెమ్ సాంగ్స్ అవసరమా? పోనీ ఆవేమైనా చూసేలా ఉన్నాయా అంటే.. భోగం మేళాల కంటే నీచంగా ఉందా పాటల పిక్చరైజేషన్. సో, 1980 ఫ్లేవర్ తప్ప సినిమాలో కంటెంట్ కానీ ఎమోషన్ కానీ ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించదు.
విశ్లేషణ : నిజానికి ఈవారం విడుదలవుతున్న 8 తెలుగు సినిమాల్లో జనాలు కాస్తో కూస్తో చూడగ్గ చిత్రం “స్నేహమేరా జీవితం”. ట్రైలర్ చూసి సినిమాలో ఏదో ఉంది అనుకోని థియేయర్లకి వచ్చిన జనాలకు రెండు గంటలపాటు బోర్ కొట్టించడంతోపాటు.. అసభ్యకరమైన రెండు ఐటెమ్ సాంగ్స్ తో చిరాకు కూడా పెట్టించే చిత్రం “స్నేహమేరా జీవితం”.
రేటింగ్ : 1.5/5