ప్రముఖ నిర్మాత వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ తెరకెక్కిస్తున్న ట్రెండీ క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్’(Baa Baa Black Sheep). ప్రస్తుతం మేఘాలయలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, విష్ణు ఓ అయ్, కార్తికేయ దేవ్, కశ్యప్, విస్మయ, మాల్వి మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మేఘాలయలో సంపూర్ణంగా షూటింగ్ జరుపుకుంటున్న తొలి సినిమా బా బా బ్లాక్ షీప్ కావడం గమనార్హం. ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతోందీ సినిమా. ఆరుగురి మధ్య సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ ఇది. గన్స్, గోల్డ్, హంట్ అంటూ ఆసక్తికరంగా ఉంటుంది. బా బా బ్లాక్ షీప్ గురించి వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘మా బా బా బ్లాక్‌షీప్ మేఘాలయాలో పూర్తి స్థాయిలో షూటింగ్ చేసుకుంటున్న తొలి చిత్రం. కథ మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాలో సాగుతుంది కాబట్టి, ఇక్కడే చిత్రీకరిస్తున్నాం. కథలోనే ఓ బ్యూటీ ఉంటుంది. జలపాతాలు, కొండలు, అందమైన ప్రదేశాల్లో సాగే కథ ఇది. ఎన్నో చోట్ల రెక్కీ చేసి, మా కథకు మేఘాలయా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఇక్కడ ఫిక్స్ అయ్యాం’’ అని అన్నారు.
ఎప్పుడూ వర్షం కురుస్తూ ఉండే సోహ్రా (చిరపుంజి)లో ‘బా బా బ్లాక్ షీప్’ని తెరకెక్కిస్తున్నారు. ఎల్లవేళలా వర్షం పడుతూ ఉన్న చోట షూటింగ్ చేయడం ఇబ్బందితో కూడిన వ్యవహారం కాదా? ఇదే విషయం గురించి వేణు మాట్లాడుతూ ‘‘చాలా కష్టమైన వ్యవహారం. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే మనకు కావాల్సిన లైటింగ్ ఉంటుంది. కానీ, అన్నిటినీ అధిగమించి మా టీమ్ ఎంతో కృషి చేస్తున్నారు. తప్పకుండా మన ప్రేక్షకులకు కనువిందు చేసే సినిమా అవుతుంది’’ అని అన్నారు.
సమిష్టి కృషిని, సమైక్యతను విశ్వసించే చిత్రాలయం స్టూడియోస్, ‘బా బా బ్లాక్ షీప్’ కోసం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. మేఘాలయ ఛీఫ్ మినిస్టర్ మిస్టర్ కన్రాడ్ కె సంగ్మా ఇటీవల సినిమా యూనిట్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేఘాలయలో షూటింగ్ కోసం తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.
అద్భుతమైన పాయింట్, ఎలాగైనా సక్సెస్ సాధించాలనే యూనిట్ పట్టుదల, ఎక్స్ ట్రార్డినరీ విజువల్స్… అన్నీ కలిసి `బా బా బ్లాక్ షీప్`ని ఆడియన్స్ ముందు మంచి సినిమాగా నిలపనున్నాయి. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే చిత్రాలయం స్టూడియోస్ ఈ సారి కొత్త దర్శకుడు గుణి మాచికంటిని ఈ సినిమాతో పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. సినిమాను రికార్డ్ టైమ్‌లో పూర్తి చేసి, అత్యధిక మంది ప్రేక్షకులకు ప్రేమతో అందించాలనే పట్టుదలతో పనిచేస్తోంది మూవీ యూనిట్.