బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా చాలా మందికి ఫేమ్ వచ్చింది. కాకపోతే కొందరు మాత్రమే సినిమాల్లో రాణించగలిగారు. బిగ్ బాస్ విన్నర్స్ గా నిలిచిన శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, బిందు మాధవి.. వీరెవరికీ కూడా సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే రన్నరప్ గా నిలిచిన వాళ్లు, మధ్యలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కి మాత్రం సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సోహైల్ కి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఏకంగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. అతడు నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ సినిమా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. బిగ్ బాస్ నుంచి వచ్చిన ఓ హీరోపై ఇంత మొత్తం పెట్టుబడి పెట్టడమంటే మాములు విషయం కాదు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్, ఆండ్రూ, ప్రవీణ్ పూడి లాంటి పేరున్న టెక్నీషియన్స్ పని చేశారు. అందుకే ఇంత బడ్జెట్ అయింది.
సోహైల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు అతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియా ఖాతాలో అతడికి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే నిర్మాతలు కూడా రిస్క్ తీసుకొని అతడిపై ఇంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. మరి థియేటర్లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరోపక్క వీజే సన్నీ హీరోగా ‘అన్ స్టాపబుల్’ సినిమా తెరకెక్కుతోంది.
ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హీరోలుగా నటిస్తోన్న సినిమాలు చూడడానికి జనాలు థియేటర్లకు వస్తారా..? బిగ్ బాస్ ఫేమ్ వెండితెరపై కంటిన్యూ అవుతుందా..? అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఈ సినిమాలకు పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చినా.. బిగ్ బాస్ హీరోలకు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తాయి. మరేం జరుగుతుందో చూడాలి!