18 Pages Review: 18 పేజెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
December 24, 2022 / 12:09 AM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
నిఖిల్ (Hero)
అనుపమ పరమేశ్వరన్ (Heroine)
అజయ్, పోసాని, బ్రహ్మాజీ, సరయు తదితరులు.. (Cast)
పల్నాటి సూర్యప్రతాప్ (Director)
బన్నీ వాసు , అల్లు అరవింద్, సుకుమార్ (Producer)
గోపీ సుందర్ (Music)
ఎ. వసంత్ (Cinematography)
Release Date : డిసెంబర్ 23, 2022
“కార్తికేయ 2″తో పాన్ ఇండియన్ హిట్ అందుకొని సంచలనం సృష్టించిన నిఖిల్ సిద్ధార్ధ్ – అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం “18 పేజస్”. “కుమారి 21ఎఫ్” ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ ఎంటర్ టైనర్ పై మంచి అంచనాలున్నాయి. మరి నిఖిల్-అనుపమ కాంబినేషన్ మరోమారు ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: సిద్ధు (నిఖిల్ సిద్ధార్ధ్) ఓ యాప్ డెవలపర్. ప్రెజంట్ జనరేషన్ & ట్రెండ్ కు తగ్గట్లు యాప్స్ డెవలప్ చేస్తూ ఉంటాడు. తాను ఇష్టపడిన అమ్మాయిని ప్రేమించి.. కొన్నాళ్లు సల్లాపాలు సాగించిన తర్వాత బ్రేకప్ అవుతుంది. దాంతో ప్రేమ అంటేనే పడదు అనే స్టేజ్ లో డిప్రెషన్ కి గురైన సిద్ధుకు ఒక డైరీ దొరుకుతుంది. నందిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఆ డైరీ చదివిన తర్వాత ప్రేమపై తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్న సిద్ధు.. నందినిని కలవాలనుకుంటాడు.
ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. అసలు నందిని ఎవరు? ఆమెను కలవాలనుకున్న సిద్ధుకు ఎదురైన ఇబ్బందులేమిటి? అనేది “18 పేజస్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: ట్రెండీ యువకుడిగా నిఖిల్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ పరిణితి ప్రదర్శించాడు. ముఖ్యంగా యూత్ అందరూ నిఖిల్ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. నిఖిల్ స్టైలింగ్ కూడా ఈ చిత్రంలో బాగుంది.
అనుపమ పాత్ర క్యారెక్టర్ ఆర్క్ మొదలైన విధానం బాగున్నా.. ఎండింగ్ మాత్రం అలరించలేకపోయింది. ఇచ్చిన ఎలివేషన్ కి, చివర్లో జస్టిఫికేషన్ కి సరిగా సింక్ అవ్వకపోవడంతో ఆమె పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సరయు క్యారెక్టర్ & కామెడీ బాగా పండాయి.
సాంకేతికవర్గం పనితీరు: సుకుమార్ కథలో అనేసరికి క్లైమాక్స్ విషయంలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అయితే.. “18 పేజస్” క్లైమాక్స్ చాలా సాధారణంగా ముగియడం, ఆయన మార్క్ కనిపించకపోవడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకి మైనస్ గా మారాయి. సుకుమార్ ఒక్క ప్రేమ గురించే కాక, బాధ్యతల గురించి వివరించిన తీరు బాగుంది. యూత్ & కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి సినిమాలో. దర్శకుడు సూర్యప్రతాప్ ఫస్టాఫ్ లో సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. అయితే.. సెకండాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే “18 పేజస్” ఒక సూపర్ హిట్ సినిమాగా నిలిచేది.
సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఈ చిత్రానికి సెకండ్ హీరో అని చెప్పాలి. తన పాటలతో, నేపధ్య సంగీతంతో సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. చాన్నాళ్ల తర్వాత పాటల్లో సాహిత్యం వినిపించింది. సందర్భానుసారంగా వచ్చే సాహిత్యం అర్ధవంతంగా ఉండడమే కాక.. మనసుకి హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా సినిమాకి తగ్గట్లుగా ఉన్నాయి.
విశ్లేషణ: ఒక సాధారణ ప్రేమకథను, అసాధారణంగా తెరకెక్కించగలగడం, ఎమోషన్స్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయడం అనేది చిన్న విషయం కాదు. ఆ విధంగా చెప్పాలంటే.. కథకుడిగా సుకుమార్, దర్శకుడిగా సూర్యప్రతాప్ విజయం సాధించారనే చెప్పాలి. నిఖిల్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, అనుపమ క్యారెక్టరైజేషన్ & గోపీ సుందర్ సంగీతం కోసం “18 పేజస్”కచ్చితంగా ఒకసారి చూడొచ్చు!