తన కొడుకు మరింత ధైర్యాన్ని ఇచ్చాడని చెప్పిన సోనాలి బింద్రే!

తెలుగు స్టార్ హీరోలతో నటించి మంచి పేరుతెచ్చుకున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమె ఈ విషయాన్ని అందరితో దైర్యంగా చెప్పి చికిత్సకోసం న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ  చికిత్సలో భాగంగా కీమో థెరపీ నిమిత్తం జుట్టు కూడా కత్తిరించుకున్నారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా తాను క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయాన్ని తన 12 ఏళ్ల కుమారుడు రణ్‌వీర్‌కు ఎలా చెప్పాలా? అని ఇబ్బంది పడిన సంగతిని నేడు వెల్లడించారు. “రణ్‌వీర్‌ జన్మించిన రోజు నుంచి వాడే నా హృదయానికి రారాజు. అప్పటి నుంచి మా ఇద్దరి జీవితాలు సంతోషంతో నిండిపోయాయి. ఎప్పుడైతే నాకు క్యాన్సర్‌ ఉందని తెలిసిందో, ఆ క్షణం నుంచి ఈ విషయాన్ని రణ్‌వీర్‌కు ఎలా చెప్పాలా? అని నేనూ, నా భర్త గోల్డీ సతమతమయ్యాం.

ఇప్పటి వరకు వాడి దగ్గర ఏ విషయం దాచింది లేదు. మొత్తానికి ధైర్యం చేసి రణ్‌వీర్‌కి నా వ్యాధి గురించి చెప్పాం. కానీ రణ్‌వీర్‌లో నాకు ఎలాంటి భయం కనిపించలేదు. సమస్యను అర్థం చేసుకున్నాడు. నాకు మరింత ధైర్యం, బలం వచ్చినట్లు అనిపించింది” అని సోనాలి చెబుతూ కొడుకుతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. “ఇలాంటి విషయాలను పిల్లలతో పంచుకోవడం ముఖ్యమేనని నా అభిప్రాయం. వారిని బాధపెట్టకూడదని చెప్పకుండా ఊరుకోవడం కంటే చెప్పి వారితో మరింత సమయం గడపడం మంచిది.” అని సూచించారు. ఇప్పుడు రణ్‌వీర్‌తో కలిసి తాను ఆనందమైన క్షణాలను గడుపుతున్నట్లు తెలిపారు. కొడుకు అల్లరితో తన జీవితంలోకి మళ్లీ వెలుగు వచ్చినట్లు అయిందని సోనాలి ఆనందం వ్యక్తం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus