హిందీ టీవీ నటి, బాలీవుడ్ హీరోయిన్, కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన సోనారికా భడోరియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన భర్త వికాస్ పరాశర్‌తో కలసి తమ జీవితంలోకి చిన్నారిని ఆహ్వానించాం అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఇది మాకు మధురమైన, అత్యంత గొప్ప ఆశీర్వాదం. మా ప్రపంచం మొత్తం ఆమెనే అని ఆ పోస్టులో ఆనందంగా పేర్కొంది సోనారికా భడోరియా.
సోనారికా కొద్ది రోజుల క్రితం బేబీ బంప్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. బీచ్ ఒడ్డున దిగిన ఫొటోలకు అప్పట్లో లైకుల వర్షం కురిసింది. ఇప్పుడు తల్లిదండ్రులం అయ్యాం అనే పోస్టుకు విషెస్ కామెంట్స్ తెగ వస్తున్నాయి. సోనారిక 2024లో ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు ప్రేమలో ఉన్నారు. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంలో సోనారిక బిజీ అయిపోయింది.
2011లో ‘తుమ్ దేనా మేరా సాత్’ అనే షోతో టీవీలోకి ఎంట్రీ ఇచ్చిన సోనారిక ‘దేవోంకీ దేవ్… మహాదేవ్’ అనే సీరియల్‌లో పార్వతీ దేవిగా నటించింది. ఆదిశక్తి, పార్వతీ దేవి, దుర్గాదేవి పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘పృథ్వీ వల్లభ్ ఇతిహాస్ భీ రహాసయా బీ’ అనే సీరియల్‌లో మృణాల్వతి పాత్ర కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక తెలుగుకు వచ్చేసరికి నాగశౌర్య ‘జాదూగాడు’ సినిమా ఆమెకు ఫస్ట్ మూవీ. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’, ‘ఆడో రకం ఈడో రకం’ సినిమాల్లో నటించింది.