Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత విక్రమ్‌ భట్, ఆయన సతీమణి శ్వేతాంబరిని ముంబయి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో ఆరుగురితో కలసి వీరిద్దరూ ఓ వైద్యుణ్ని మోసం చేసినట్లు ఆరోపణలు రావడమే దీనికి కారణం. రాజస్థాన్‌కు చెందిన ఇందిరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ అజయ్‌ మర్దియా ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను రూ.30 కోట్లకు మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన ఉదయ్‌పుర్‌ పోలీసులు ముంబయి వచ్చి అరెస్టు చేశారు.

Vikram Bhatt

తన భార్య జీవిత చరిత్రను సినిమాగా తీయాలని విక్రం భట్‌ను ఇందిరా ఐవీఎఫ్‌ ఆసుపత్రుల యజమాని మర్దియా సంప్రదించారు. దీన్ని అవకాశంగా మార్చుకున్న విక్రమ్‌ భట్‌ దంపతులు రూ.47 కోట్లు పెట్టుబడి పెడితే నాలుగు సినిమాలు తీస్తానని చెప్పారట. ఈ క్రమంలో రూ.200 కోట్ల లాభం వస్తుందని కూడా నమ్మించారట. అయితే రూ.30 కోట్లు తీసుకుని రెండు పూర్తి చేసి, మిగిలినవి తీయలేదట. ఈ నేపథ్యంలోనే మర్దియా ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు.

విక్రమ్ భట్ గత కొంతకాలంగా ఇంట్లో లేరు. దీంతో పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముంబయిలోని యారీ రోడ్డులో ఉన్న మరో ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ విక్రమ్‌ భట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అది విక్రమ్ భట్ వదిన ఇల్లు అని సమాచారం. విక్రమ్ భట్‌తోపాటు, అతడి భార్య, కూతురు కృష్ణ, ఉదయ్‌పూర్‌కి చెందిన దినేశ్ కటారియా, సహ నిర్మాత మెహబూబ్ అన్సారీ పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయని బాలీవుడ్‌ మీడియా సమాచారం.

ఇక వీరిని ముంబయి నుండి ఉదయ్‌పూర్‌కి తీసుకెళ్లేందుకు బాంద్రా కోర్టులో ట్రాన్సిట్ రిమాండ్‌ కోసం పోలీసులు కోరారు. మరోవైపు విక్రమ్ భట్ మాత్రం ఈ అరెస్ట్ అన్యాయం అంటున్నాడు. ఫిర్యాదుదారు, పోలీసుల్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో ఇంకేం తేలుతుందో చూడాలి.

 బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus