‘ప్యారడైజ్’ (The Paradise) సినిమాలో నాని ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ‘ఏంటీ జడలు’ అన్నారంతా. అందులో కొంతమంది వావ్ అని అంటే.. ఇంకొందరు ఇదేంటి అని అన్నారు. అయితే ఆశ్చర్యం మాత్రం అందరిలో కామన్. ఎందుకంటే జడలు వేసుకొని హీరోలు నటించడం అరుదు. ఈ సినిమాకు ఆ జడలే ప్రచార అస్త్రాలు కూడా అయ్యాయి. ఆ జడల కథ ఏంటి అనే విషయాన్ని ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్ అయ్యాయి.
నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనలు, మరికొన్ని ఫిక్షనల్ అంశాలను యాడ్ చేసి ‘ది ప్యారడైజ్’ (The Paradise) కథ రాసుకున్నాను అని శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు. హీరోకి జడలు అనే కాన్సెప్ట్ మాత్రం తన జీవితం నుండి తీసుకున్నాను అని చెప్పారు. అమ్మకి ఆడపిల్లలు అంటే ఇష్టం కానీ ఆడపిల్ల పుట్టలేదని తాను రెండో తరగతికి వచ్చే వరకు జడలేసి, గౌన్లు వేసే పెంచారు అని శ్రీకాంత్ చెప్పారు.
తన చిన్నతనంలోని ఆ జడల ఎమోషన్‌ని ‘ప్యారడైజ్’ (The Paradise) సినిమాలో పెట్టాను అని చెప్పారాయన. అలాగే తన స్వస్థలం గోదావరిఖని, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో భాగం చేసుకున్నాను అని చెప్పారు. సినిమాలో సవారీ తెగని తాము సృష్టించామని, ఇలాంటి తెగ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేదు అని చెప్పారు. ఈ మేరకు తాము రీసెర్చ్ చేసినప్పుడు, ఎక్కడా స్పష్టమైన ఆధారాలు దొరకలేదు అని చెప్పారు.
ఈ సినిమాలో నాని రెండు జడల లుక్ గురించి చెప్పినప్పుడు.. తన టీమ్‌లోనే చాలా మంది వద్దన్నారట. అదెలా సెట్ అవుతుందిది.. ట్రోల్ చేస్తారేమో అని డౌట్ పడ్డారు. కానీ, కథ రీత్యా ఆ లుక్‌కి, పాత్రకి ఓ నేపథ్యం, ఎమోషన్ ఉన్నాయి. అందుకే ఆ జడల్ లుక్‌ని బలంగా నమ్మాను. దాన్నే తీసుకెళ్లి నానికి చెప్పా. ఆయన కూడా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రంలో జడలే ఆయన ఆయుధం అని చెప్పారు.