థియేటర్లలో హిట్ కొట్టిన సినిమాలు.. టీవీల్లోకి వచ్చినప్పుడు ఆ స్థాయి విజయాన్ని అందుకోకపోవడం మనం గతంలో చూశాం. థియేటర్లకు, టీవీలకు రిలీజ్ డేట్‌ల విషయంలో చాలా గ్యాప్ ఉండటం వల్ల.. ఆ టాక్ కొనసాగలేదు అని అనుకోవచ్చు. కానీ థియేటర్ రిలీజ్‌కి, ఓటీటీ రిలీజ్‌కి అంత గ్యాప్ ఉండటం లేదు. దీంతో థియేటర్ – ఓటీటీ టాక్‌ల మధ్య తేడా రాదు అనుకుంటారు అంతా. అయితే ఈ విషయం కరెక్ట్ కాదు అని.. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు నిరూపిస్తుంటాయి.
తాజాగా ‘ఇరుముడి’ (Irumudi) సినిమా మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. ‘ఇరుముడి’ సినిమా ఇటీవల ఓటిటిలో వచ్చింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు ఒప్పందం వల్ల 28 రోజుల విండో కారణంగా అప్పుడే డిజిటల్ రిలీజ్ అయిపోయింది. స్మార్ట్ టీవీ, మొబైల్స్‌లో సినిమాను చూసిన వాళ్లు ‘సినిమాలో అంత సీన్ లేదు’ అంటూ పెదవి విరుస్తున్నారు. థియేటర్లలో బాగా పేలాయి అంటున్న సీన్స్‌కి ఓటీటీలో అంత రెస్పాన్స్ లేదు.
‘ఇరుముడి’ (Irumudi) సినిమా దర్శకుడు శివ నిర్వాణ చేసిన పొరపాట్లు, వదిలేసిన లాజిక్కులు ఉన్నాయి. తెర మీద చూసినప్పుడు కొన్ని సీన్లు, పాటల విషయంలో మ్యాజిక్ జరిగిపోవడంతో ఆ మైనస్సులను అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ‘ఇరుముడి’ (Irumudi) అంటే దేవుడి నేపథ్యంలో సినిమా అనుకొని కొందరు ఏమీ మాట్లాడలేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఓటీటీలోకి వచ్చేసరికి అవన్నీ పట్టించుకోకుండా ఆ మైనస్‌లను హైలైట్ చేస్తున్నారని అర్థమవుతోంది.
అయినా టాలీవుడ్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ‘ఉప్పెన’, ‘మిరాయి’, ‘జాతి రత్నాలు’ లాంటి సినిమాలకు కూడా ఇలానే జరిగింది. అదే సమయంలో థియేటర్లలో సరైన ఫలితం రాని సినిమాలకు ఓటీటీలో మంచి స్పందనే వచ్చింది. ఈ నేపథ్యంలో థియేటర్లలో విజయం అందుకున్న సినిమాలకు ఓటీటీలోనూ అదే ఫలితం రావాలని కోరుకోవద్దు అని మన దర్శకనిర్మాతలు, ఓటీటీ జనాలు అర్థం చేసుకోవాలి.