ఒక సినిమాను మించి మరో సినిమా రావాలి… అని అందరూ చెబుతారు. అయితే అదేమంత ఈజీ కాదు. ఇప్పుడు సుకుమార్ – అల్లు అర్జున్ కూడా ఇదే ఫేజ్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు. ‘తగ్గేదేలే..’ అంటూ ‘పుష్ప’గా గతేడాది ఆఖరు నుండి దేశవ్యాప్తంగా హంగామా చేస్తోన్న ఈ ద్వయం.. ఇప్పుడు ‘పుష్ప 2’ పనుల్లో ఉంది. అయితే ఇప్పుడు వారు పడుతున్న కష్టాన్ని డబుల్, ట్రిపుల్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు ట్రేడ్ పరిశీలకులు. కారణం ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్ 2’ అని చెప్పొచ్చు.
‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్ 2’ సినిమాలు వచ్చి టాలీవుడ్ దర్శకులు కొత్త బూస్టింగ్ ఎంతవరకు ఇచ్చాయో తెలియదు కానీ, ఎలివేషన్ సీన్లు, మాస్ మేనరిజమ్స్, ఫ్యాన్స్ రియాక్షన్ మూమెంట్స్ ఇంపార్టెన్స్‌ను మరింత పెంచే పరిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో సుకుమార్ టీమ్ మరోసారి స్క్రిప్ట్ మీద, ఎలివేషన్ల మీద కూర్చోక తప్పదు అని చెబుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కనిపించినప్పుడల్లా రాజమౌళి ఇచ్చిన హైప్ మనకు తెలుసు. ‘కేజీయఫ్ 2’లో యశ్‌ను చూపించినప్పుడల్లా ప్రశాంత్ నీల్ పెంచిన హార్ట్ బీట్ కూడా తెలుసు.
ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో సుకుమార్ వాటిని మ్యాచ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఒకటి రెండు ఎక్కువ డిగ్రీల హీటే జనరేట్ చేయాలి. లేకపోతే ‘పుష్ప 2’ సినిమా బాక్సాఫీసు దగ్గర తేలిపోతుంది అని చెప్పేయొచ్చు. అయితే ‘పుష్ప’కు కలిసొచ్చే అంశం… ఇప్పటికే ‘పుష్ప’రాజ్ మేనరిజమ్స్ జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. తెలుగు వాళ్లకే కాదు దేశం నలుమూలలా ‘జూకేగా నహీ’ అంటూ దూసుకుపోతున్నారు. క్రికెటర్లు కూడా అదేపని చేశారు.
కాబట్టి ‘పుష్ప2’ బ్లాక్‌బస్టర్ అవ్వడానికి ఫౌండేషన్ అయితే రెడీగా ఉంది. ఇక చేయాల్సిందల్లా ‘పుష్ప 1’ను మించి ‘పుష్ప 2’ను సిద్ధం చేసి తీసుకురావడమే. నిజానికి ఈ పాటికి రెండోపార్టు షూటింగ్ మొదలుపెట్టి డిసెంబరులో విడుదల చేయాలి. కానీ ఏమైందో కానీ టీమ్ ఇంకా స్టోరీ, స్క్రీన్‌ప్లే పనిలో ఉందని సమాచారం. దానికితోడు సుకుమార్ అమెరికా వెళ్లారని అంటున్నారు. ఇటీవల సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద సినిమా ముహూర్తం జరిగినా సుకుమార్ రాలేదు ఇందుకేనట. మరి అక్కడ ఏం చేస్తున్నారు అనేది తెలియాలి.