ఒక సినిమా రెండు ముక్కలు చేయడం అనేది ఈ మధ్య మనం చూస్తున్నాం. చిన్న సినిమాలకు, సాధారణ సినిమాలకు చేయడం లేదు కానీ.. పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ కాన్సెప్ట్ వాడుతున్నారు. ఒక సినిమా బజ్‌ను రెండు సినిమాలుగా మార్చి కాస్త అధికంగా సంపాదించుకునే ఆలోచన అది అని అంటుంటారు. అయితే కథ కోరింది కాబట్టి రెండు భాగాలు అని టీమ్ చెబుతుంటుంది. ఈ చర్చ ఎంతైనా తేలదు కాబట్టి.. వదిలేద్దాం. అయితే ఇప్పుడు ఆ రెండు కాస్త మూడు అవుతోంది.
‘కేజీయఫ్ 3’ అంటూ రెండో ‘కేజీయఫ్’ ఆఖరున చెప్పి ట్విస్ట్ ఇచ్చారు కదా.. అలానే ‘పుష్ప’ విషయంలోనూ ట్విస్ట్ ఉంటుంది అంటున్నారు. అవును, ‘పుష్ప’రాజ్ ప్రయాణం రెండు తడవలకు ఆగిపోదు అని చెబుతున్నారు. ‘పుష్ప 3’ విషయంలో టీమ్ ఇప్పటికే ఓ ఆలోచనకు వచ్చేసింది అని సమాచారం. ఈ మేరకు కథలో మార్పులు చేసే క్రమంలోనే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది అని చెబుతున్నారు. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ ఫుల్ జోష్‌లో సాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. మరోవైపు రెండో యూనిట్ కూడా పనులు ప్రారంభించింది అని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో రైటింగ్ టీమ్ మూడోసారి ‘పుష్ప’రాజ్‌ను దింపే పనుల్లో ఉన్నారట. ‘పుష్ప 2’ సినిమా క్లైమాక్స్‌లో బన్నీ కొత్త లుక్ లో కనిపిస్తాడని.. అది మూడో పార్ట్‌కి లీడ్‌లా ఉంటుందని సమాచారం. ఈ మేరకు ఓ లుక్ టెస్ట్ కూడా అయ్యిందని సమాచారం.
‘పుష్ప’రాజ్ ప్రయాణాన్ని ఇక్కడితో ఆపేయకుండా ఫ్రాంచైజీ తరహాలో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే మూడో పార్టు ఆలోచన చేశారు అని సమాచారం. అయితే ‘పుష్ప 2’కి మూడో భాగానికి చాలా గ్యాప్ ఉంటుందట. ఈలోపు సుకుమార్, బన్నీ వేర్వేరుగా వాళ్ల సినిమాలు చేసుకుని వస్తారని టాక్. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.