రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించే అవకాశం అంటే ఎంత పెద్దదో చెప్పండి. ఇలాంటి సినిమా చేసి, విజయం సాధిస్తే కెరీర్‌లో అంతకుమించిన మైలురాయి లేదు అనుకుంటారు సినిమా పరిశ్రమలో. అలాంటి సినిమాలో అవకాశం వచ్చి.. అనౌన్స్ అయిన తర్వాత తప్పుకుని అందరికీ షాకిచ్చారు సీనియర్ దర్శకుడు సుందర్. సినిమా అనౌన్స్ అయి, హ్యాపీ ఫేసెస్‌తో ఫొటోలు దిగి ఆ తర్వాత ‘నేను ఆ సినిమా చేయడం లేదు’ అని చెప్పారు.
అయితే సుందర్ అలా చెప్పడానికి.. ఇప్పుడు అనౌన్స్ అయిన కొత్త సినిమాకు ఏమన్నా సంబంధం ఉందా? ఏమో మరి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. విశాల్ కొత్త సినిమా ఒకటి నిన్న అనౌన్స్ అయింది. దానికి సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ సినిమా వద్దనుకున్న వెంటనే ఈ సినిమా ఓకే చేసుకున్నారా? అంటే అంత సమయం అవ్వలేదు, ఆ తర్వాత ఇద్దరూ కలిసింది లేదు అని కోడంబాక్కం వర్గాల టాక్. అంటే ముందే ఈ కథ విశాల్‌కి చెప్పి ఉండాలి.
విశాల్, సుందర్ కాంబినేషన్ హిట్ కాంబినేషనే. వీరి కలయికలో గతంలో మూడు సినిమాలు వచ్చాయి. అన్నిటికి అన్నీ మంచి ఫలితాలే అందుకున్నాయి. తొలుత ఇద్దరూ కలసి ‘ఆంబల’ అనే సినిమా చేశారు. ఇది ఫర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత ‘యాక్షన్’ అనే సినిమా చేశారు. ఇది ఇబ్బందికర ఫలితం అందుకుంది. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు విడుదల కాకుండా ఆగిపోయిన ‘మద గజ రాజా’ గతేడాది సంక్రాంతికి విడుదలై అనూహ్యంగా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ కాంబినేషన్ ఎప్పుడొచ్చినా, ఎంత ఆలస్యంగా వచ్చినా హిట్టే అనే పేరు సంపాదించుకుంది.
ఇక కొత్త సినిమాకు వాళ్లకు అచ్చొచ్చే హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను విశాల్, సుందర్ కలసి సరదా వీడియోతో అనౌన్స్ చేశారు. సుందర్ ప్రస్తుతం నయనతారతో ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ పనులు అయిపోతే విశాల్ సినిమా స్టార్ట్ చేస్తారట. ఈ సినిమా ఎప్పటిలా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అని సమాచారం.