Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…
- February 10, 2026 / 03:15 PM ISTByFilmy Focus Desk
సూర్య అంటే ఇప్పుడు మాస్, కమర్షియల్ హీరో అనిపించుకుంటున్నాడు కానీ.. కెరీర్ ప్రారంభంలో వినోదభరితమైన ప్రేమ కథలకే ఓటేసేవాడు. కొన్ని సినిమాలు ఇబ్బందికర ఫలితాన్ని అందుకున్నా ఆయన ప్రేమకథలు ఆపలేదు. అలాంటి సమయంలో అంటే 2002లో సూర్య నుండి వచ్చిన ‘మౌనం పేసియదే’ కెరీర్‌లో ఓ మంచి ప్రేమకథగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘కంచు’ అనే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు కూడా. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 13న సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు.
Suriya
ఈ నేపథ్యంలో సూర్య ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ‘మౌనం పేసియదే’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ‘మౌనం పేసియదే’ సినిమాలో తాను నటించిన పాత్రల సంభాషణలను వాట్సాప్ స్టేటస్‌లు, రీల్స్, షాట్స్‌గా ఇప్పటికీ చూస్తున్నానని చెప్పాడు. ఆ వీడియోలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్పాడు సూర్య. 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ చాలామంది ఫేవరేట్ అని చెప్పడం ఆనందంగా ఉందని కూడా చెప్పాడు.

ఈ సినిమాలో కథానాయికలుగా త్రిష, లైలా, నేహా ఉన్నా.. సినిమాలో ఎవరినీ కౌగిలించుకోలేదని.. సినిమాను అలా అద్భుతంగా తెరకెక్కించారని సూర్య చెప్పుకొచ్చాడు. యువన్ శంకర్‌రాజా సంగీతంలోని పాటలు తన ఫేవరేట్ పాటల్లో ఉంటాయని చెప్పాడు. ఈ సినిమాను కేవలం తమిళంలోనే రీరిలీజ్ చేస్తున్నారు. తెలుగులో సినిమాను అయితే తీసుకురావడం లేదు. తెలుగులో గత కొన్నేళ్లుగా ఎక్కువైన ఈ రీరిలీజ్ ట్రెండ్.. ఇప్పుడు తమిళంలోకి బాగా పాకింది. అక్కడ వరుసగా ఇదే పని చేస్తున్నారు.











