దేశ, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ.. భద్రత పెంచినప్పటికీ అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతిరోజు దేశంలోని ఏదొక ప్రాంతంలో అమ్మాయిలు కామాంధుల చేతుల్లో నలిగిపోతున్నారు. ముఖ్యంగా అత్యాచారానికి అర్ధం కూడా తెలియని బాలికలపై మృగాళ్లు పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లో ఎనిమిదేళ్ల అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఈ విషయం తెలిసిన వెంటనే నటి తమన్నా బాధపడింది. ఆవేశపడింది. ట్విట్టర్ వేదికపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఎనిమిదేళ్ల అమ్మాయి జమ్మూ కాశ్మీర్‌లో అత్యాచారానికి గురైంది. మరో చోట 16 ఏళ్ల అమ్మాయిపై లైంగికదాడి చేశారు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ తండ్రి పోరాటం చేస్తుంటే… ఆ కామాంధుడిని కాపాడటం కోసం బాధితురాలి తండ్రిని చచ్చేంత వరకూ కొట్టారు.
అసలు ఈ దేశం ఎటు పోతోంది? దీనిపై చట్ట సవరణలు చేసే వరకూ ఎంతమంది నిర్భయాలు తమ ప్రాణాలను త్యాగం చేయాలి. ఒక దేశం మహిళలను సురక్షితంగా బతకనీయకుంటే.. మహిళల పట్ల అలాంటి నీచమైన ఆలోచనతో కొనసాగుతుంటే.. ఖచ్ఛితంగా ఆ దేశానికి చికిత్స అవసరం’’ అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలోనే కాకుండా బయటకూడా చర్చ మొదలయింది. స్టార్ హీరోయిన్ ఈ విషయంపై స్పందించడంతో మృగాళ్లు విజృభించకుండా కఠినమైన, వేగవంతమైన శిక్షలు అమలు చేయాలనీ అనేక మంది కోరుతున్నారు. అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.