మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించి హ్యాట్రిక్ హిట్ అందుకున్న డైరక్టర్ కొరటాల శివ రూపొందించిన తాజా చిత్రం భరత్ అను నేను. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో ముఖ్యమంత్రిగా నటించారు. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై మొదట నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఫస్ట్ ఓత్, భరత్ విజన్ లు పెంచాయి. పాటలు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ క్రేజ్ కారణంగా ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ బిజినెస్ వందకోట్లు దాటింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియాలోను భారీగా రిలీజ్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ మూవీ థియేటర్లో రానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే భరత్ అనే నేను సినిమా గురించి ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సంచలన ట్వీట్ చేశారు. “అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రేపు ఓ సునామీ రాబోతోంది. దిమ్మతిరిగే రీతిలో అమెరికాలో ప్రీమియర్ షోలు మొదలవబోతున్నాయి. కౌంట్ డౌన్ మొదలయింది. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు ‘భరత్ అనే నేను’ సిద్ధమవుతున్నాడు..’ అంటూ ట్వీట్ చేశారు. గురువారం రాత్రి అమెరికాలో సుమారు 2000 ప్రీమియర్ షోలను వేయనున్నారు. మొదటి వీకెండ్‌లో మొత్తం 10వేల షోలు ఉండేట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ భారీస్థాయి షోల వలన రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ వస్తాయి.