తాప్సి.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. ఆమె కెరీర్ ప్రారంభించింది ఇక్కడే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారు ఆమెకి ఇక్కడ మంచి పునాది వేశారు. ఇక్కడ చాలా సినిమాల్లో నటించింది. అందులో కొన్ని హిట్ అయ్యాయి కూడా..! కానీ టాలీవుడ్లో ఆమె స్టార్ గా ఎదగలేకపోయింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఈమె ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉండగా..
ఛాన్స్ దొరికిన ప్రతీసారి ఆమె సౌత్ సినీ మేకర్స్ పై ఏవో ఒక కామెంట్లు చేస్తూనే ఉంటుంది. తాజాగా ఓ స్టార్ హీరో ఆమెతో సినిమా చేయడానికి ఇష్టం లేదని చెప్పి తప్పుకున్నాడంటూ సంచలన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “ఓ సినిమాలో నాది డబుల్ రోల్. అందులో హీరో పాత్ర కోసం ఓ స్టార్ హీరోని సంప్రదించారు నిర్మాతలు. అయితే ఆ హీరో ఒప్పుకోలేదు.అంతకు ముందు నాతో అతను ఓ సినిమాలో కూడా చేసాడు.
అతను పెద్ద స్టారే అయినప్పటికీ అతని ఇమేజ్ దెబ్బ తింటుందేమో అనే అభద్రతగా భావంతో తప్పుకోవడం నాకు బాధ అనిపించింది.తర్వాత ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోలను సంప్రదించినా వారు కూడా ముందుకు రాలేదు. ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకే ఎక్కువ పడతాయనే ఉద్దేశంతో అతను తప్పుకున్నాడు” అంటూ తాప్సి చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా ఏంటి? ఆ హీరో ఎవరు? అనే విషయాల పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.