“మొగలిరేకులు” సీరియల్ తో స్టార్ డమ్ సంపాదించుకున్న ఆర్.కె.సాగర్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “ది 100”. “నన్ను క్షమించండి, లడ్డు” వంటి షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న శశిధర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పలు ఫిలిం ఫెస్టివల్స్ లో ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సినిమా మీద నమ్మకంతో విడుదలకు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ కూడా వేశారు. మరి వారి నమ్మకం ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించగలిగింది అనేది చూద్దాం..!!
కథ: ఐపీఎస్ గా టాప్ ర్యాంక్ హోల్డర్ విక్రాంత్ (ఆర్.కె.సాగర్ నాయుడు), ట్రైనింగ్ టైం నుండి తన పటిమను చాటుతూ మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటాడు.
సరిగ్గా అదే సమయంలో హైద్రాబాద్లో కొన్ని దొంగతనాలు జరుగుతుంటాయి. వాటిని అరికట్టడం కోసం రంగంలోకి దిగిన విక్రాంత్ కి, ఆ దొంగతనాల్లో ఆర్తి (మిషా నారంగ్) కూడా బాధితురాలని తెలుసుకొంటాడు. అయితే.. ఆ అమ్మాయి కానీ, ఆమె తండ్రి కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు.
ఆర్తి & ఫ్యామిలీ ఎందుకని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఇంతకీ ఈ దొంగతనాలు చేస్తున్నది ఎవరు? వాళ్ల గోల్ ఏమిటి? వాళ్లని విక్రాంత్ ఎలా పట్టుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ది 100” చిత్రం.
నటీనటుల పనితీరు: ఆర్కే నాయుడుగా దాదాపు 6 ఏళ్ల పాటు పోలీస్ గా నటించి ఉన్న ఆర్కే సాగర్ కి ఈ చిత్రంలో విక్రాంత్ పాత్ర పెద్ద కష్టమేమీ కాదు. చాలా సునాయాసంగా చేసేశాడు. బాడీ లాంగ్వేజ్, లుక్స్ అచ్చు పోలీస్ లా ఉండడం అతడి మెయిన్ ప్లస్ పాయింట్. ఇక ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నాడు.
మిషా నారంగ్ ఈ సినిమాలో మంచి నటన కనబరిచింది. ఆమె పాత్రలో ఉన్న బరువైన ఎమోషన్స్ ను బాగా క్యారీ చేసింది. అలాగే.. సహాయ పాత్రలో ధన్య బాలకృష్ణ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో అలరించింది.
తారక్ పొన్నప్ప మరోసారి నెగిటివ్ షేడ్ రోల్లో ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు సరైన బ్యాక్ స్టోరీ కూడా ఉంటే బాగుండేది.
తల్లి పాత్రలో కల్యాణి నటరాజన్ ఎప్పట్లానే చాలా చక్కని స్క్రీన్ ప్రెజన్స్ తో క్యారెక్టర్ ని పండించింది.
సాంకేతికవర్గం పనితీరు: శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం కంటెంట్ ను ఎలివేట్ చేయడానికి తోడ్పడింది.
అయితే.. ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ టీమ్ ఇంకాస్త ప్రోపర్ అవుట్ పుట్ ఇవ్వాల్సింది. ఇలాంటి పోలీస్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలకు డీటెయిల్స్ చాలా కీలకం. మర్డర్ స్పాట్ ను చూపించే విధానంలో సహజత్వం లోపించింది. అలాగే.. కొన్ని కీ డీటెయిల్స్ ను మిస్ చేశారు. డి.ఐ & కలర్ గ్రేడింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది.
దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ వీలైనంత మేరకు సహజంగా సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే.. కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. సినిమాలో అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ప్రస్తుత తరం ప్రేక్షకులు మలయాళ సినిమాలను ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఎలాంటి డీవియేషన్స్ లేకపోవడమే. మరి శశిధర్ ఆ విషయంలో ఎందుకని కాస్త స్ట్రిక్ట్ గా ఉండలేకపోయాడు అనేది ప్రశ్నార్ధకం. ఎందుకంటే.. ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా అతడి అభిరుచి ఆశ్చర్యపరిచింది.
ఎలాంటి సోది లేకుండా చాలా స్ట్రయిట్ గా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడు “నన్ను క్షమించండి, లడ్డు” వంటి షార్ట్ ఫిలిమ్స్ తో. తదుపరి సినిమాల విషయంలోనైనా ఈ తరహా కమర్షియల్ డీవియేషన్స్ లేకుండా జాగ్రత్తపడితే బాగుంటుంది. ఆ మైనస్ పాయింట్స్ ను పక్కన పెడితే.. కథను ఆసక్తికరంగా నడిపించడంలో.. లాజికల్ గా కన్విన్స్ చేయడంలో మాత్రం అలరించాడు శశిధర్.
విశ్లేషణ: మలయాళంలో “కన్నూరు స్క్వాడ్” అనే సినిమాను అక్కడక్కడా “ది 100” చిత్రం గుర్తుకు చేసినప్పటికీ.. ఓవరాల్ గా ఎంగేజ్ చేస్తుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఆర్కే సాగర్ స్క్రీన్ ప్రెజన్స్, శశిధర్ టేకింగ్ – స్క్రీన్ ప్లే & క్లైమాక్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో, రొటీన్ కి భిన్నంగా కాస్త రియలిస్టిక్ సినిమా చూడాలనుకునేవారు “ది 100” సినిమాని ఓ లుక్కేయొచ్చు!
ఫోకస్ పాయింట్: కమర్షియాలిటీ కాస్తంత ఎక్కువైనా.. ఆలోచింపజేసే చిత్రం!
రేటింగ్: 2.5/5