హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న తిరువీర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో”. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ సినిమా కోర్ పాయింట్ ను ట్రైలర్ లోనే రివీల్ చేసి మంచి పని చేశారు. సింపుల్ కాన్సెప్ట్ ఫిలింగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: విజయనగరం జిల్లాలోని ఓ గ్రామంలో ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు రమేష్ (తిరువీర్). అతనికున్న ఒకే ఒక్క అసిస్టెంట్ రామ్ (రోహన్ రాయ్) అమాయకంగా చేసే తప్పుల్ని సీరియస్ గా తీసుకోకుండా, తన స్టూడియో ఎదురుగా ఉండే పంచాయితీ ఆఫీస్ లో పని చేసే హేమ (టీనా శ్రావ్య)ను ప్రేమగా చూసుకుంటూ జీవితం చాలా సాఫీగా సాగుతుంటుంది.
జిల్లాలోనే ది బెస్ట్ ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్ చేయమని ఆనంద్ (నరేంద్ర రవి) వచ్చి అడగడంతో.. దాదాపు లక్షన్నర పెట్టి ఖర్చు పెట్టించి మరీ షూటింగ్ అంతా చేస్తాడు రమేష్.
కట్ చేస్తే.. సదరు ఫోటోషూట్ ఫుటేజీ మొత్తం ఉన్న మెమరీ కార్డ్ ను రామ్ ప్యాంట్ కి ఉన్న కన్నం కారణంగా ఎక్కడో పడిపోతుంది.
ఆనంద్-సౌందర్యలకు ఫుటేజ్ పోయిందనే విషయం ఎలా చెప్పాలో తెలియక, ఆ మెమరీ కార్డ్ కోసం వెతుక్కుంటూ రమేష్ నానా ఇబ్బందులు పడుతుంటాడు.
ఈ సమస్య నుండి బయటపడేందుకు అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం రమేష్ తోపాటు ఆనంద్ జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అనేది “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమాలో హీరో తిరువీర్ అయినప్పటికీ.. ఆనంద్ పాత్ర పోషించిన నరేంద్ర రవి ఎక్కువగా డామినేట్ చేశాడు. అతని పాత్రకి ఉన్న లేయర్స్ & ఎమోషన్స్ కూడా అలాంటివే కావడం, కామెడీ కూడా ఎక్కువగా తని పాత్ర ద్వారానే పండడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఇక్కడ కూడా మెచ్చుకోవాల్సింది తిరువీర్ నే. సినిమాకి నేను హీరో అనే ఇన్సెక్యురిటీతో అతను ఏమాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అయినా.. ఆనంద్ పాత్ర ఇంత బాగా వచ్చేది కాదు. ఈగో లేకుండా ఆనంద్ క్యారెక్టర్ ఆర్క్ కి తోడ్పడిన తిరువీర్ ప్రశంసార్హుడు.
తిరువీర్ పాత్ర కూడా భలే ఉంటుంది. కోపం, నిస్సహాయత్వం, కంగారు వంటి ఎమోషన్స్ ను సమానంగా పండించిన అతడి ప్రతిభకు ఇంకా చాలా సినిమాలు పడాలి. ముఖ్యంగా తన సమస్యను మర్చిపోయి.. ఎదుటివాళ్ళ సంతోషం కోసం తాపత్రయపడే స్వభావాన్ని చాలా స్వచ్ఛంగా పండించాడు తిరువీర్.
“కమిటీ కుర్రాళ్లు” ఫేమ్ టీనా శ్రావ్య చాలా ఒద్దికగా హేమ పాత్రలో ఒదిగిపోయింది. ఉత్తరాంధ్ర యాస కానీ, పల్లెటూరి అమ్మాయిగా ఆమె ఆహార్యం కానీ చాలా సింపుల్ గా ఉన్నాయి. మన పక్కింటి అమ్మాయిలా కనిపించే టీనా లాంటి తెలుగు హీరోయిన్లకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలి.
90’s ఫేమ్ రోహన్ మరోసారి మంచి నటనతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించాడు. పాత్రలోని అమాయకత్వాన్ని చాలా సహజంగా పండించాడు.
పాత్ర స్క్రీన్ స్పేస్ తక్కువ అయిన్నప్పటికీ.. కనిపించిన కాసిన్ని సన్నివేశాల్లోనూ మంచి నటన కనబరిచింది యామిని. ఆమె కళ్ళల్లో అమాయకత్వం, బేలతనం భలే ముచ్చటగా ఉన్నాయి.
మన కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వస్తున్న ప్రభావతి, మాధవి వంటి సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించాయి.
సాంకేతికవర్గం పనితీరు: సురేష్ బొబ్బిలి పాటలు వినసొంపుగా ఉండగా.. నేపథ్య సంగీతం మాత్రం ప్రేక్షకుల్ని ఉత్తరాంధ్రకు తీసుకెళ్లిపోయింది. ఓపెనింగ్ టైటిల్స్ నుండి క్లోజింగ్ క్రెడిట్స్ వరకు ప్రతి సన్నివేశంలో ప్రాంతీయతనమైన హుందాతనాన్ని చక్కగా మేళవించాడు.
సోమశేఖర్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. లిమిటెడ్ లొకేషన్స్ ను కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో బోర్ కొట్టించకుండా వాడుకున్నాడు. సినిమాలో ఎక్కడా టైట్ క్లోజ్ షాట్ అనేది లేకపోవడం, దాదాపుగా కీలకమైన ఎమోషన్స్ అన్నిట్నీ వైడ్ షాట్స్ తోనే కవర్ చేసిన విధానం బాగుంది. అలాగే.. కలర్ గ్రేడింగ్ విషయంలోనూ మరీ ఎక్కువగా షార్ప్ చేయకుండా.. సహజత్వం ఉండేలా చూసుకున్న తీరు కూడా బాగుంది.
ఇక దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ పనితనం గురించి మాట్లాడుకోవాలంటే.. ముందుగా ఇంత సింపుల్ కథను ఎక్కడా అనవసరంగా కాంప్లికేట్ చేయకుండా, లీనియర్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం బాగుంది. అలాగే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను సిన్సియర్ గా డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అన్నిటికీ మించి పాత్రలను మలిచిన తీరు, సందర్భం బట్టి మనిషి స్వభావం, ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అనేది చాలా సింపుల్ గా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ పేసింగ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ వేగం పుంజుకుంటుంది. ఫస్టాఫ్ విషయంలోనూ ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అయినప్పటికీ.. రాహుల్ శ్రీనివాస్ కి మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. అలాగే అతడ్ని సపోర్ట్ చేసిన నిర్మాతలను కూడా మెచ్చుకోవాలి. సింగిల్ పాయింట్ గా ఈ కథను నమ్మి డబ్బులు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. కానీ.. దర్శకుడి ప్రతిభను నమ్మి రిస్క్ చేశారు. మంచి ఫలితం దక్కిందనే చెప్పాలి.
విశ్లేషణ: ఈమధ్యకాలంలో తమిళ, మలయాళ భాషల చిత్రాలతో పోల్చినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కాన్సెప్ట్ సినిమాలు రావడం లేదు అనేది ప్రస్తుతం వినిపిస్తున్న కంప్లైంట్. ఆ లోటును ఓ మోస్తరుగా తీర్చిన చిత్రం “ది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్”. సింపుల్ కాన్సెప్ట్ ను దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ డీసెంట్ గా డీల్ చేసిన విధానం, నటీనటులు కేవలం పాత్రధారులుగా కనిపించిన తీరు, స్వచ్ఛమైన-ఆరోగ్యకరమైన కామెడీ కోసం ఈ చిత్రాన్ని సరదాగా కుటుంబంతో కలిసి చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: ఆహ్లాదభరిత సింపుల్ సినిమా!
రేటింగ్: 3/5