ప్రస్తుతం హాలీవుడ్, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ది ఒడిస్సీ ప్రభంజనం కొనసాగుతోంది. తెలుగులో కలెక్షన్ల పరంగా ఈ వారం రిలీజైన సినిమాలన్నింటిని దాటేసి బాక్సాఫీస్ వద్ద ఈ హాలీవుడ్ మూవీ అదరగొడుతోంది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాట్ డామన్, టామ్ హాలెండ్, అన్నే హాథ్‌వే, రాబర్ట్ ప్యాటిన్సన్ కీలక పాత్రల్లో నటించారు. వార్ డ్రామాగా రూపొందిన ది ఒడిస్సీ ఎలా ఉంది? ఈ సినిమాతో క్రిస్టోఫర్ నోలన్ ఎలాంటి మ్యాజిక్ చేశాడంటే?
కథ: స్పార్టా ను ఆక్రమించాలని ఒడిస్సియస్ (మాట్ డామన్) వేసిన ఎత్తులేవి ఫలించవు. చివరకు గుర్రపు బొమ్మలో రహస్యంగా తన సైన్యంతో కలిసి దాక్కొని ట్రాయ్ నగరంలోకి ప్రవేశించి నగరాన్ని నాశనం చేస్తాడు. స్పార్టాను ఆక్రమిస్తాడు ట్రోజన్ వార్‌లో తన సైనికులు సాగించిన నరమేథం ఒడిస్సియస్‌ను కలిచివేస్తుంది. యుద్దాన్ని ఆపేసి తిరిగి తన రాజ్యం ఇథాకాకు వెళ్లాలని అనుకుంటాడు. ఏడేళ్లు దాటినా కూడా ఒడిస్సియస్ ఇథాకా చేరుకోడు. దారి తప్పి సముద్రంలోనే తిరుగుతుంటాడు. ఈ ప్రయాణంలో ఒంటికన్ను రాక్షసుడు, మంత్రగత్తెతో పాటు అనేక అడ్డంకులు ఒడిస్సియస్ సైన్యానికి ఎదురవుతాయి. ఈ ప్రమాదాల్లో సైనికులందరిని కోల్పోయిన ఒడిస్సియస్ ఒంటరిగా మిగిలిపోతాడు. మరోవైపు భర్త ఒడిస్సియస్ కోసం పదేళ్లుగా అతడి భార్య పెనెలోపీ (అన్నే హాథ్ వే) ఎదురుచూస్తుంటుంది.
వారి కొడుకు టెలెమాకస్‌ను (టామ్ హాలెండ్) చంపేసి ఇథాకా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఆంటినస్ కుట్రలు పన్నుతుంటాడు. ఒడిస్సియస్ చనిపోయాడని ప్రజలను నమ్మించి పెనెలోపిని మళ్లీ పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు ఆంటినస్. ఒడిస్సియస్ దారి తప్పిపోవడానికి కారణమేమిటి? దేవుళ్లను ఎదురించి తన సైన్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి సాహసాలు చేశాడు? ఒడిస్సియస్ కష్టపడి గెలిచిన స్పార్టా ఎలా నాశనమైంది? అతడికి ఆశ్రయం ఇచ్చిన కాలిప్సో ఎవరు? ఒడిస్సియస్ గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? జ్యూయిష్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఒంటికన్ను రాక్షసుడి శాపం కారణంగా సముద్ర ప్రయాణంలో ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నదే ది ఒడిస్సీ మూవీ కథ. .
నటీనటుల పనితీరు: ఒడిస్సియస్ పాత్రలో మాట్ డామన్ అసమాన నటనను కనబరిచాడు. వీరుడిగా, తండ్రిగా, భర్తగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. ఒడిస్సియస్ కొడుకు పాత్రలో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాలెండ్ కనిపించాడు. తండ్రి ప్రేమ కోసం తపించే కొడుకుగా అతడి నటన పర్వాలేదనిపిస్తుంది. పెనాలోపి క్యారెక్టర్‌లో అన్నే హాథ్‌వే మెప్పించింది. జెండయా, సమంతా మోర్టన్‌తో చాలా మంది హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు: గ్రీకు పురాతన గాథను నేటి జెన్‌జీ తరానికి కనెక్ట్ అయ్యేలా కమర్షియల్ హంగులతో ది ఒడిస్సీలో చూపించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఈ హీరోయిజం, లవ్, అడ్వెంచర్ అంశాలతో గ్రీకు పురాణాలు గురించి తెలియని వారు కూడా సినిమాలో లీనం అయ్యేలా చేశాడు. రెండు గంటల యాభై మూడు నిమిషాల రన్‌టైమ్‌తో కూడిన మూవీ. కానీ అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. విజువల్స్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. సముద్రం నేపథ్యంలో వచ్చే ప్రతి సీన్ అదిరిపోతుంది.
విశ్లేషణ: ది ఒడిస్సీ అచ్చం చందమామ కథలా అనిపిస్తుంది. యుద్ధంలో గెలిచిన ఓ నాయకుడు తిరుగు ప్రయాణంలో ఎదుర్కొన్న అడ్డంకుల చుట్టూనే ఈ సినిమా సాగుతుంది. ఈ సింపుల్ పాయింట్‌కు మంత్రాలు, మాయలు, కుట్రలు, శాపాలు అంటూ ఒక్కో పాయింట్‌ను జోడిస్తూ విజువల్ వండర్‌గా క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను తీర్చిదిద్దాడు. సినిమా మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేలో సాగుతుంది. గతం, ప్రస్తుతాన్ని చూపిస్తూ కథను నడిపించారు. అయినా ఎక్కడ కన్ఫ్యూజింగ్‌గా అనిపించదు.
రాజు లేని రాజ్యంగా ఇథాకాను చూపిస్తూ కథను మొదలుపెట్టారు దర్శకుడు. చుట్టూ పొంచి ఉన్న శత్రువులు…అయినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పెనెలోపి, టెలెమాకస్ ఉన్నట్లుగా చూపించి ఓ సింపథీ క్రియేట్ చేశారు. ఓ అందగత్తె చేతిలో బందీగా ఉన్న ఒడిస్సియస్ చూపిస్తూ అతడి సాహసాలను ఒక్కొక్కటిగా వెండితెరపై ఆవిష్కరించారు.
ఒంటికన్ను రాక్షసుడితో పాటు ఐరన్ మాస్క్‌లు ధరించిన భారీకాయులతో యుద్ధం, మంత్రగత్తె చేతిలో తన సైన్యం జంతువులుగా మారిపోవడం, సముద్రంలో సుడిగండం బారి నుంచి బయటపడే సీన్…ప్రతీదీ గూస్‌బంప్స్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హీరో చివరకు లక్ష్యాన్ని చేరుకోవడం సినిమాల్లో కామన్. హాలీవుడ్, టాలీవుడ్ ఎక్కడైనా ఇదే ఫార్ములా ఫాలో అవుతుంటారు డైరెక్టర్లు. ఇందులో కూడా అదే జరిగింది.
మారువేశంలో ఇథాకా చేరిన ఒడిస్సియస్ శత్రువులందరిని ఒకే చోటికి చేర్చి హతమార్చే సీన్‌లో ఎలివేషన్లు, హీరోయిజం అదిరిపోయాయి. ఆ సీన్లకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమే.
సినిమా బాగున్నా స్లోగా సాగడమే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒడిస్సియస్ జర్నీ మొదలయ్యే వరకు వచ్చే ఆరంభ సన్నివేశాలన్నీ బోర్ కొట్టిస్తాయి. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అనగానే బుర్రకు పదును పెట్టే స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉంటాయని ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఇందులో అలాంటివేమీ లేవు. నార్మల్ కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యారు. స్క్రీన్‌ప్లే కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది.
ఫోకస్ పాయింట్: ది ఒడిస్సీ ఓ విజువల్ వండర్. క్రిస్టోఫర్ నోలన్ నుంచి వచ్చిన రెగ్యులర్ కమర్షియల్ సినిమా.
రేటింగ్ : 3/5