గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొంది.. రెండేళ్లపాటు ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ల్యాబ్ లోనే మూలిగి.. గత నెల తమిళంలో విడుదలై మిక్స్డ్ రివ్యూలు అందుకున్న ఈ చిత్రం ఇవాళ తెలుగులో విడుదలైంది. మరి ఈ తూటా సరైన విధంగా వర్కవుట్ అయ్యిందో లేదో చూద్దాం..!!
కథ: రఘు (ధనుష్) తాను కాలేజ్ టైమ్ లో ప్రేమించిన లేఖ (మేఘా ఆకాష్) ముంబైలో ఆపదలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి.. ఒక గ్యాంగ్ ఫైట్ లో ఇరుక్కుంటాడు.
అసలు లేఖ ముంబైలో ఎందుకు ఉంది? రఘు గ్యాంగ్ ఫైట్ లో ఎందుకు ఇరుక్కున్నాడు? లేఖను కాపాడగలిగాడా? అనేది “తూటా” కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా ధనుష్ పనితనం గురించి చర్చించుకోవాల్సిన స్థాయిని అతడు ఎప్పుడో దాటేశాడు. తాను పోషించే పాత్రకు ప్రాణం పోయడమే ధ్యేయంగా నటిస్తున్నాడు ధనుష్. ఈ చిత్రంలోనూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రఘు క్యారెక్టర్ లో చాలా ఈజీగా ఇమిడిపోయాడు.
మేఘా ఆకాష్ అందంగా కనిపించడమే కాక అభినయంతోనూ ఆకట్టుకొంది. శశికుమార్, సెంథిల్ వీరస్వామి పాత్రలు అలరిస్తాయి. గెస్ట్ రోల్లో రాణా, స్నేహితురాలి పాత్రలో సునైన పాత్రలు ఆకట్టుకుంటాయి.
సాంకేతికవర్గం పనితీరు: గౌతమ్ మీనన్ చెప్పిందేమీ కొత్త కథ కాదు.. కొత్తగానూ చెప్పలేదు. ఈ రెండు సినిమాకి మైనస్ పాయింట్సే. అయితే.. ఈ రెండిటికంటే పెద్ద మైనస్ సినిమాలో ప్రతి అయిదు నిమిషాలకి వచ్చే వాయిస్ ఓవర్. సన్నివేశాన్ని ప్రేక్షకుడు అర్ధం చేసుకోవడానికి లేదా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకొనేలోపు ఇమ్మీడియట్ గా వచ్చే వాయిస్ ఓవర్ పెద్ద మైనస్. “సూర్య సన్నాఫ్ కృష్ణమూర్తి” సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ వాయిస్ ఓవర్ “తూటా” చిత్రానికి మైనస్ గా మారడానికి కారణం కథనం.
పేరలల్ స్క్రీన్ ప్లేగా సాగే ఈ కథనంలో క్లారిటీ కూడా కొరవడుతుంది. భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులందర్నీ ఒక విశేషమైన రీతిలో ఆకట్టుకున్న “మరువాలి” పాట చిత్రీకరణ బిగ్గెస్ట్ డిజప్పాయింట్మెంట్. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ టాప్ క్లాస్ గా ఉన్నప్పటికీ.. మూస కథ, సాగతీత కథనం కారణంగా “తూటా” బోర్ కొట్టిస్తుంది.
విశ్లేషణ: ధనుష్ పెర్ఫార్మెన్స్ కోసమే సినిమా చూడాల్సిన అవసరం ప్రేక్షకుడికి ఇంకా ఏర్పడలేదు. నటుడి అభినయం ఆకట్టుకోవాలంటే అలరించే కథనం కూడా ఉండాలి. గౌతమ్ మీనన్ స్క్రీన్ ప్లేలో ఈసారి ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. దాంతో ఈ తూటా తేలిపోయింది.
రేటింగ్: 1.5/5