విక్టరీ వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని అంత ఈజీగా ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై హీరో రామ్ పెదనాన్న శ్రీ స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అందుకే సోషల్ మీడియాలో వెంకటేష్ అభిమానులతో పాటు ‘నువ్వు నాకు నచ్చావ్’ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.’ #21YearsOfCultClassicNNN ‘ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్లో కూడా నిలిచింది ‘నువ్వు నాకు నచ్చావ్’. ఈ క్రమంలో ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :
1) ‘కలిసుందాం రా’ వంటి ఇండస్ట్రీ హిట్, ‘జయం మనదేరా’ వంటి హిట్ సినిమాలతో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న వెంకటేష్ ఆ తర్వాత ‘దేవి పుత్రుడు’ ‘ప్రేమతో రా’ వంటి సినిమాలు చేశారు.ఇవి సెట్స్ పై ఉండగానే మరికొన్ని సినిమాలకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కానీ ‘దేవి పుత్రుడు’ ‘ప్రేమతో రా’ సినిమాలు ప్లాప్ కావడంతో వెంకీ కాస్త ఆలోచనలో పడ్డారు. ముందుగా కమిట్ అయిన సినిమాలను కూడా పక్కన పెట్టారు. ఇందులో దశరథ్ తో చేయాల్సిన ‘సంతోషం’ కూడా ఉంది.
2) అయితే అప్పటికే ‘నువ్వే కావాలి’ అనే చిత్రం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్ర దర్శకుడు విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్ లకు మంచి పేరొచ్చింది. అంతకంటే ముందే ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ కు ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు వెంకీ. ఇదే బ్యానర్ లో వెంకటేష్ 1988 లో ‘వారసుడొచ్చాడు’ అనే చిత్రం కూడా చేశారు. అప్పటి నుండీ డేట్స్ ఖాళీ లేకపోవడం వలన వెంకీ ఈ బ్యానర్లో సినిమా చేయలేకపోయారు.
3) ఇక ‘నువ్వే కావాలి’ సూపర్ హిట్ అవ్వడంతో ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్ట్ పై కూడా వర్క్ చేయడం మొదలుపెట్టారు విజయ భాస్కర్- త్రివిక్రమ్ లు. ముందుగా తరుణ్ ను హీరోగా అనుకున్నారు. కానీ తర్వాత ఈ కథలో మంచి లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అందుకు వెంకటేష్ అయితే కరెక్ట్ అని భావించి సురేష్ బాబుని అప్రోచ్ అయ్యారు మేకర్స్.
4) ముందుగా వెంకీ డేట్స్ ఖాళీ లేవు అని చెప్పారు సురేష్ బాబు.ఈ క్రమంలో ‘తరుణ్ తోనే సెట్స్ పైకి వెళ్దాం’ అని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. తరుణ్ ను అప్రోచ్ అవ్వకముందే సురేష్ బాబు.. స్రవంతి రవి కిషోర్ కు కాల్ చేసి వెంకటేష్ డేట్స్ ఉన్నాయి అని చెప్పారట. అలా కథ మెటీరియలైజ్ అవ్వగానే వెంకటేష్ తో ఈ కథని పట్టాలెక్కించారు.
5) ఈ చిత్రంలో హీరోయిన్లుగా ముందు త్రిష, గజాల వంటి వారి పేర్లను పరిశీలించారు. కానీ హిందీలో ఓ సినిమా చేసిన ఆర్తి అగర్వాల్ ను ఫైనల్ చేశారు.
6) అలాగే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం ముందుగా నాజర్ ను అనుకున్నారట. కానీ నాజర్ కొన్ని కారణాల వల్ల చేయలేను అని చెప్పడంతో ప్రకాష్ రాజ్ ను ఫైనల్ చేశారు. అయితే ఆ టైంలో ప్రకాష్ రాజ్ తెలుగు సినిమాల్లో నటించకూడదు అనే నిషేధం ఉంది. అందుకే ప్రకాష్ రాజ్ లేని పార్ట్ చిత్రీకరణ ముందుగా ఫైనల్ చేశారు. అటు తర్వాత ప్రకాష్ రాజ్ పై బ్యాన్ ఎత్తేసారు. వెంటనే బ్యాలన్స్ షూటింగ్ ను ఆయనతో ఫినిష్ చేశారు.
7) మొదట ఈ చిత్రంలో బ్రహ్మానందం పార్ట్ లేదట. కానీ సురేష్ బాబు – వెంకటేష్ సూచనల మేరకు బ్రహ్మానందం ట్రాక్ ను యాడ్ చేశారు. అది కూడా ఆడియన్స్ కు హిలేరియస్ ఫీలింగ్ ను ఇచ్చింది.
8) ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని రూ.7 కోట్లలో ఫినిష్ చేశారు. ఒక ఇల్లు, అవుట్ హౌస్, కారు, వాటర్ వరల్డ్, రైల్వే స్టేషన్. పాటలకు కూడా ఎక్కువగా విదేశాలకు వెళ్ళింది లేదు. గ్రాఫిక్స్ తో మాయ చేశారు. కంటెంట్ ఉంటే హంగులు, ఆర్భాటాలు మాకు అవసరం లేదని ప్రేక్షకులు చాటి చెప్పిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి.
9) సినిమా రిలీజ్ కు ముందు.. 3 గంటల రన్ టైం అంటే ఆడియన్స్ బోర్ ఫీలవుతారు అంటూ డిస్ట్రిబ్యూటర్లు గోల పెట్టారట. దీంతో సురేష్ బాబు వారికి ప్రత్యేకంగా షో వేయించారు. ఆ తర్వాత రెండో మాట లేకుండా వాళ్ళు సినిమాని సేమ్ రన్ టైంతో విడుదల చేశారు.
10) ఫైనల్ గా సినిమా సూపర్ హిట్ అయ్యింది. 93 కేంద్రాల్లో 50 రోజులు, 57 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది ఈ మూవీ.
‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం తమిళ్ లో విజయ్ హీరోగా ‘వసీగార’ గా , కన్నడలో ఉపేంద్ర హీరోగా ‘గౌరమ్మ’ గా, బెంగాలీలో ‘మజ్ను’ గా రీమేక్ అయ్యింది. కానీ అక్కడ ఈ మూవీ సక్సెస్ సాధించలేదు.