పి.వి.సింధు రియల్ లైఫ్ సీక్రెట్స్

పి.వి.సింధు. ప్రస్తుతం భారత దేశంలో మారుమోగుతున్న పేరు. రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఆమె క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఐకాన్ అయింది. భాగ్యనగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు గురించి మీకు తెలియని ఆసక్తికర సంగతులు..

పి.వి.సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. జులై 5, 1995 లో జన్మించింది. తండ్రి రమణ వాలీబాల్ ప్లేయర్. అర్జున అవార్డు అందుకున్నారు. తల్లి విజయ కూడా వాలీబాల్ క్రీడాకారిణి.

మహీంద్రా హిల్స్ లో ని ఆక్సిలియం స్కూల్ లో సింధు ప్రాధమిక విద్య సాగింది. మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కళాశాలలో బికాం డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది.

సింధు కి ఒక అక్క ఉన్నారు. ఆమె పేరు దివ్య. ఆమె ప్రస్తుతం నెల్లూరులో వైద్యవిద్య చదువుతున్నారు.

సింధు చిన్నప్పుడు సికింద్రాబాద్లో ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ కోర్టుల్లో కోచ్ మహబూబ్ అలీ వద్ద శిక్షణ పొందింది. అనంతరం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో గురువు పుల్లెల గోపీచంద్ వద్ద పదేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటోంది.

కోచ్ చెప్పిన డైట్ మాత్రమే సింధు తీసుకుంటుంది. కూతురు కోసం తల్లి దండ్రులు కూడా ఆ ఆహారాన్నే తినడం అలవాటు చేసుకున్నారు.

సింధు చిన్నపటి నుంచి ప్రాక్టీస్ కి డుమ్మా కొట్టలేదు. తెల్లవారు జామున 4 నుంచే ఆమె సాధన మొదలయ్యేది. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ కావాలన్నదే ఆమె లక్ష్యం.

2013 లో సింధు అర్జున అవార్డు అందుకుంది. 18 ఏళ్లకే అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారిణిగా రికార్డ్ లోకి ఎక్కింది.

సింధు అతి చిన్న వయసు (20 ఏళ్లు ) లోనే పద్మశ్రీ పురస్కారం(2015) అందుకుని చరిత్ర సృష్టించింది.

ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారత మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె తర్వాత విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన తెలుగమ్మాయి పి.వి.సింధు మాత్రమే. అంతేకాదు ఇప్పటి వరకు ఏ భారత నారి.. కాంస్యం దాటి ముందుకెళ్లలేదు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలవడమే ఇప్పటిదాకా బ్యాడ్మింటన్లో భారత షట్లర్ల అత్యున్నత ప్రదర్శన. కానీ సింధు ఒక అడుగు ముందుకేసింది.

2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజిత పథకం తో చరిత్ర సృష్టించి కోట్ల భారతీయుల కలల్ని నిజం చేసింది మన తెలుగు తేజం పి.వి.సింధు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus