పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ నెల 19న ఉగాది కానుకగా వస్తున్న ఈ సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా టికెట్లు అమ్మకం మొదలుపెట్టేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల విషయంలో చాలా తేడా కనిపిస్తోంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు ఉండటం.. తెలంగాణలో ఈ పరిస్థితి లేకపోవడమే కారణం. గతంలో తెలంగాణలో రేట్లు పెంచి, ఆంధ్రప్రదేశ్‌లో పెంపు ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపోయింది.
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాకు నైజాంలో ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం ఉదయం 7:30 గంటలకు తొలి షో పడనుంది. రెగ్యులర్ రేట్లకే టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారు. అంటే సింగిల్ థియేటర్లలో అన్ని పన్నులు కలిపి రూ.200, మల్టీప్లెక్సుల్లో సుమారు రూ.400 వరకు పడుతుందన్నమాట. టికెట్ల అమ్మకం మొదలైంది కాబట్టి.. ఇక టికెట్ రేట్ల పెంపు తెలంగాణలో లేనట్లే అని తేల్చేయొచ్చు. అయితే స్పెషల్ షో ఉంటుందా? ఉంటే టికెట్ ధర ఎంత ఉండొచ్చు అనేదే ఇక్కడ పాయింట్.
ప్రత్యేక షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే ఆంద్రప్రదేశ్‌లో 19న వేకువ జామునే షో వేస్తారా? లేక ముందు రోజు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. అయితే ఏపీలా ఇక్కడ కూడా ఆ రోజు వేకువజామునే ఉంటుంది అని చెబుతున్నారు. అయితే కచ్చితంగా చెప్పలేం అనేది సినిమా సన్నిహిత వర్గాల మాట.
గురువారం తెల్లవారుజామున (4గంటల తర్వాత) బెనిఫిట్ షో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను రూ.500 (అన్ని పన్నులతో కలిపి)గా నిర్ణయించి జీవో విడుదల చేశారు. సినిమా విడుదైలన తొలి పది రోజులు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశమిచ్చారు. ఆ లెక్కన రెండు రాష్ట్రాల మధ్య టికెట్ ధరల వ్యత్యాసం ఇదీ.