సినిమాల ప్రచారం మొత్తం సోషల్ మీడియా మీదనే జరుగుతున్న రోజులివి. ఏ విషయం చెప్పాలన్నా, ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వాలన్నా అందులోనే అన్నీ చేసేస్తున్నారు. ఆ సోషల్ మీడియా పేజీలను ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఎవరు పోస్టులు పెడతారు అనేది పెద్దగా ఆసక్తి లేని అంశం. అయితే ఆ విషయంతో సినిమా ప్రచారం చేసుకోవచ్చా… రాజమౌళి టీమ్ చేస్తున్న పనిని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉంది.
అక్కడ చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరిస్తున్నారని సమాచారం. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తయినట్లేనట. అయితే అక్కడ సినిమాకు సంబంధించిన వివరాలను గత కొద్ది రోజుల నుండి టీమ్ తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇస్తూ వస్తోంది. అయితే దీని నిర్వహణను ఈ రోజు నుండి ఎన్టీఆర్ చూస్తారట. అంటే ఏ పోస్టులు చేయాలి అనేది ఆయన ఇష్టమేమో. గతంలోనూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తమ ఇన్‌స్టాను ఆలియా భట్‌కి ఇచ్చింది.
ఆమె ఏదో అప్డేట్స్ ఇస్తుందేమో అని అభిమానులు, నెటిజన్లు ఎదురుచూశారు. అయితే మేకప్ వేసుకుంటున్న నాలుగు ఫొటోలు పెట్టి మమ అనిపించింది. ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి ఇన్‌స్టా హ్యాండిల్ వచ్చింది. మరి ఎన్టీఆర్ ఏం షేర్ చేస్తారో చూడాలి. పిట్ల గోడ కబుర్లు లాంటివి తప్ప పెద్ద ఆశ్చర్యపోయే విషయాలు వస్తాయని ఆశించొచ్చా… తారక్!