సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా తన నటనతో ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి ఈరోజు కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. కొంతకాలంగా ఈమె వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తోంది. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో జన్మించిన ఈమె అసలు పేరు శంకరమంచి జానకి. కేవలం 11 ఏళ్ల వయసులోనే రేడియో కార్యక్రమాల ద్వారా తన కళా ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అటు తర్వాత రంగస్థల వేదిక పై అడుగుపెట్టి నటిగా మంచి గుర్తింపు పొందారు. 1950లో 18 ఏళ్ల వయసులోనే ‘షావుకారు’ తో వెండితెరకు కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అఖండ విజయం సాధించడంతో, ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తన 7 దశాబ్దాల సినీ కెరీర్ లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకొని దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు జానకి. ఆమె ఫిల్మోగ్రఫీలో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.
జానకి గారి నటనకి ఆమె హావభావాలు తోడై పాత్రని రక్తికట్టించేవి. ఒక్కటే రకమైన పాత్రలకి పరిమితం కాకుండా ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఇండియన్ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తించి, ప్రభుత్వం 2022లో జానకికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది. అలాంటి గొప్ప నటిని కోల్పోవడం అనేది యావత్ సినీ పరిశ్రమకి తీరని లోటు అనే చెప్పాలి. ఇక షావుకారు జానకి మరణానికి చింతిస్తూ చాలా మంది సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.