మహానటిలో తన పాత్ర ఏమిటో చెప్పిన విజయ్ దేవరకొండ!

అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి” వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, క్యూట్ బ్యూటీ సమంత జమునగా కనిపించనుంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. అలనాటి విలక్షణ నటుడు ఎస్ వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారని టాక్. ఇక ఇందులో అర్జున్ రెడ్డి మూవీలోని హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలిని పాండేలు నటిస్తున్నారు. వారి పాత్రలు ఇవేనంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి.

ఈ రూమర్స్ పై విజయ్ దేవరకొండ స్పందించారు. తాను అక్కినేని నాగేశ్వరరావు పాత్ర పోషించడం లేదని స్పష్టం చేశారు. జర్న లిస్ట్ పాత్రలో కాసేపు కనిపిస్తానని వివరించారు. రోల్ చిన్నదైనప్పటికీ సావిత్రి బయోపిక్ కావడంతో అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం  గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో విజయ్ చేస్తున్న సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. శ్రీరస్తు శుభమస్తుతో హిట్‌ కొట్టిన పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న సినిమాని బన్ని వాసు నిర్మిస్తున్నారు.  అలాగే శ్రీధర్‌ మర్రి దర్శకత్వంలో “ఏ మంత్రం వేసావె” సినిమా చేస్తున్నారు. తెలుగు సినిమాలే కాకుండా తమిళ చిత్రం కూడా చేస్తున్నారు. “నడిగయ్యార్‌ తిలగం” అనే చిత్రంలో హీరోగా విజయ్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేఏడాది వరుసగా థియేటర్లో సందడి చేయనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus