సినీ ఇండస్ట్రీలో విజయం ఒక్క రోజులో రాదు. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి. అలాంటి నిజమైన ప్రయాణానికి నిలువెత్తు ఉదాహరణ బాలీవుడ్ సంచలనం, యంగ్ హీరో విక్రాంత్ మాస్సే . ఈ రోజు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ హీరో, ఒకప్పుడు రోజుకు తినడానికి తిండి సరిగా లేక ఇబ్బందిపడిన రోజులు చూశాడంటే నమ్మశక్యం కాకపోవచ్చు.
విక్రాంత్ చాలా చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చాడు. చదువంటే అమితమైన ఇష్టం ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలిచాయి. జీవనం సాగించేందుకు హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశాడు. అంతేకాదు, ఒక డాన్స్ స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పని చేశాడు. రోజూ నాలుగు లోకల్ ట్రైన్లు మారుతూ, దాదాపు 16 గంటలు శ్రమించేవాడినని ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. కొన్ని నెలల పాటు కేవలం బిస్కెట్లు, నీళ్లతోనే జీవితం నెట్టుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయట.
ఎంతో ఆశతో ఓ టీవీ షో కోసం ఎనిమిది నెలలు కష్టపడటం, కానీ ఆ షో ప్రసారమే కాకుండా, అందాల్సిన పారితోషికం కూడా పూర్తిగా అందలేదు అంట. అయినా విక్రాంత్ ఆత్మస్తైర్యం కోల్పోకుండా, పట్టుదలతో కష్టపడుతున్న ఆయన్ని గమనించిన ఓ మహిళా నిర్మాత అవకాశం ఇవ్వడంతో అతని జీవితం మలుపు తిరిగింది. అలా బుల్లితెరపై సెన్సషనల్ హిట్ అయిన బాలికా వధు ( చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు పడ్డాయి. 2013లో ‘లూటేరా’ తో వెండితెరపై కనిపించిన విక్రాంత్, ’12th ఫెయిల్’ సినిమాతో జాతీయ అవార్డు స్థాయికి చేరుకున్నాడు. ఇదంతా గమనిస్తే కష్టానికి ఫలితం ఆలస్యం కావచ్చేమో కానీ, తప్పకుండా ఉంటుంది అని తెలుసుకోవచ్చు.