తన అభిమాన నటుడితో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్లను చూసుంటారు. తన అభిమాన హీరోతో సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకులను చూసుంటారు. అలాగే తన ఫేవరెట్ హీరో కోసం చిన్న పాత్రలో నటించిన యాక్టర్‌లను చూసుంటారు. కానీ తన అభిమాన హీరో, ఐడల్‌గా భావించే కథానాయకుడికు విలన్‌గా ఓ యువ హీరో నటించడం ఎప్పుడైనా చూశారా? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ ఫ్రేమ్ త్వరలో తెలుగు సినిమా మీద చూడొచ్చు అంటున్నారు.
ఏదో అందరిలా ఆ హీరోను మార్గదర్శిగా తీసుకొని వచ్చిన యువ కాదు అతను. ఆ హీరోను పూర్తిగా ఐడల్‌గా భావిస్తాడు. అదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. ఇక్కడ ఆ ఐడల్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అయితే.. ఆ యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya ). అవును ఈ ఇద్దరూ కలసి సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు కానీ దాదాపు సినిమా ఫిక్స్ అయింది అని సమాచారం. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరక్షన్ రూపొందనున్న సినిమాలోనే ఇదంతా జరుగుతుంది అని టాక్.
కార్తికేయకు విలన్‌గా నటించడం కొత్తేమీ కాదు. కెరీర్ ప్రారంభంలోనే రెండు సినిమాలు చేశాడు. అజిత్‌తో (Ajith Kumar) ‘వలిమై’ చేయగా.. ఆ వెంటనే నానితో ‘గ్యాంగ్‌లీడర్’లో (Gangleader) విలన్‌గా చేశాడు. ఇప్పుడు చిరంజీవితో విలనీ చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్. హీరోగా ఇటీవల ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) తో మంచి విజయమే అందుకున్నా ఆ తర్వాత ఏమైందో కానీ ఇంకా సినిమాలు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఏకంగా విలన్ అంటున్నారు.
ఇక సినిమా గురించి చూస్తే వచ్చే సంక్రాంతికి వస్తామని ఇప్పటికే టీమ్ చెప్పేసింది. ఈ సినిమాలో మెగాస్టార్.. ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తారు అని అంటున్నారు. అందులో కాస్త కామెడీ టచ్ ఉంటుందట. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు అని సమాచారం. త్వరలో ఈ క్లారిటీలు వస్తాయి. అన్నట్లు హీరోయిన్ల సంగతి ఇంకా తేలలేదు.