చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్లో ఎప్పుడో నెలల క్రితం తెరకెక్కిన సినిమా ‘విశ్వంభర’. దర్శకుడు వశిష్ట ఆ సినిమాను పూర్తి చేసుకొని.. ఆ తర్వాత వేరే సినిమా అనౌన్స్‌మెంట్ కూడా జరుపుకున్నారు. కానీ ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో క్లారిటీ కూడా లేదు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ సినిమానే సంక్రాంతికి తీసుకొచ్చి.. సంక్రాంతికి అనుకున్న ‘కాకా’ సినిమాను వెనక్కి పంపాలని ప్లాన్ చేస్తున్నారు అంటూ ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే రెండు సినిమాల నిర్మాతలతో ఆ మధ్య చిరంజీవి మాట్లాడి ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు అని ఓ ఫొటో రిలీజ్ చేసి డైరెక్ట్‌గానే టీమ్ చెప్పేసింది. దీంతో రెండు సినిమాలను సంక్రాంతికే తీసుకొస్తారు. డబుల్ రిలీజ్ చేస్తారు అంటూ ఓ వార్త బయటకు తీసుకొచ్చారు.
అయితే, తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టిన హీరోలు, నిర్మాతలు లేరు. ఒకటి హిట్ అయితే.. ఇంకొకటి భవిష్యత్తులో ఆ సినిమా పేరు చెబితే వణికే ఫలితం అందుకున్నాయి. దీంతో చిరంజీవి అభిమానులు ఇలాంటి ప్రయత్నం చేయొద్దు అని అనుకున్నారు. వారి మాటలు చిరంజీవి వరకు వెళ్లాయో ఏమో.. ఆ ఆలోచనకు ఆయన రెడీగా లేరట. అంతేకాదు ‘విశ్వంభర’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేద్దాం అన్నారట.
ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఓటీటీ డీల్ అయిపోయింది కాబట్టి.. ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేసేద్దాం అనుకుంటున్నారట. డిసెంబరు మొదటి, ఆఖరి వారాలు బిజీగా ఉన్నాయి. కాబట్టి నవంబరులోనే తెచ్చేద్దాం అనుకుంటున్నారు. దసరా తర్వాత సినిమా ప్రచారం షురూ చేస్తారని టాక్. త్వరలో స్పెషల్ వీడియోతో ఈ విషయాన్ని చిరంజీవి చెబుతారు అంటున్నారు.