ఎన్ని థియేటర్లలో 50 రోజులు ఆడింది, ఎన్ని థియేటర్లలో 100 రోజులు ఆడింది అనే లెక్క మీద సినిమా విజయాన్ని లెక్కగట్టేవారు టాలీవుడ్‌లో (Tollywood). మా సినిమా ఎక్కువ సెంటర్లలో అర్ధ / శత దినోత్సవాలు చేసుకుంది కాబట్టి మా సినిమానే హిట్ అనేవారు. అయితే ఆ పోస్టర్లలో వేసిన థియేటర్ల లెక్క తప్పు అని తేలిపోతుండటంతో నిర్మాతలు ఆ పోస్టర్ల కాన్సెప్ట్‌ను ఆపేశారు. ఇప్పుడు వసూళ్లతో పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. వీటి విషయంలోనూ ఇప్పుడు అదే పరిస్థితి.
ఎవరూ ఊహించని, నమ్మశక్యం కాని వసూళ్లను పోస్టర్ల మీద తాటికాయంత అక్షరాలు వేసి మేమే గ్రేట్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు / చేస్తున్నారు మన నిర్మాతలు. అయితే ఒక నిర్మాత ఆ పోస్టర్లను నమ్మొద్దు. మేం అభిమానులను అలరించడానికి అలా చేస్తున్నాం అని క్లారిటీ ఇచ్చేసి కలెక్షన్ పోస్టర్ల గాలి తీసేశారు. ఇక సంక్రాంతి సినిమాలకు సంబంధించి ‘గేమ్ ఛేంజర్’కి (Game Changer) వేసిన పోస్టర్ అయితే పెద్ద చర్చకే దారి తీసింది. అయితే అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకు వేశారు అనే మాట ఎవరూ కాదనలేని విషయం.
ఈ పోస్టర్ల చర్చ ఓవైపు నడుస్తుండగానే ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో రామ్ మీద ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. అందులో దిల్ రాజు నిర్మాణ సంస్థల మీద జరిగిన దాడులే హైలైట్ అయ్యాయి. అదెందుకో అందరికీ తెలుసు. పోస్టర్ల మీద వేసిన నెంబర్లు అసలు వసూళ్లు ఒకేలా లేవని, అందుకే దాడులు జరిగాయని ఓ వాదన వినిపించింది. అయితే ఇది నిజం కాదు అని అంటున్నా.. పోస్టర్ల చర్చ నిర్మాత మండలి(Tollywood) ముందుకు వెళ్లనుందని టాక్.
సినిమాలకు సంబంధించి ఇలా వసూళ్ల పోస్టర్లు వేస్తే జనాలు థియేటర్లకు వస్తారేమో కానీ ఆ సినిమా చూశాక నిర్మాణ సంస్థ పరువు పోతుందని కొందరి వాదన. ఇక ఈ పోస్టర్ల వల్ల అభిమానుల్లో ఫ్యాన్ వార్ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాల నేపథ్యంలో నిర్మాతలు అందరరూ కలసి పోస్టర్లు ఆపేయాలి అని ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మా పోస్టర్లు మా ఇష్టం అని వేసుకుంటే రేపొద్దున పోస్టర్ వచ్చింది అనగానే ఓ వచ్చిందా అని లైట్ తీసుకుంటారు. ఆ తర్వాత సినిమాను కూడా.