విశ్వక్‌సేన్‌కి ఓ ఇమేజ్ ఉంది.. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగా చేసిన సినిమాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. అవి అతని కెరీర్ నిలబడటానికి, అతనికి ఓ ఫ్యాన్ బేస్ ఏర్పడటానికి ఆ జోనర్ సినిమాలే కారణం. ఇక్కడ దానిని జోనర్ అనే కంటే.. ఫీల్ అని అంటే బాగుంటుంది. విశ్వక్ ఎప్పుడూ కోపంగా ఉంటూ, లేదంటూ ఓ జోన్‌లో ఉంటూ ప్రేక్షకుల్ని అలరించాలి. ఆ లైన్‌కి కాస్త దూరంగా జరిగి ఇప్పుడు చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితాలు అందుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి విశ్వక్ ఆ రూట్‌లోకి వెళ్లడం కరెక్ట్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.
‘ఫంకీ’ సినిమా గురించి జనాలే కాదు, ఆ సినిమా టీమ్ కూడా మరచిపోయింది. చిన్న సినిమాలకు, సరైన టాక్ రాని సినిమాలకు సైతం ఏదో ఒకటి మాట్లాడి, ఏవో నెంబర్లతో పోస్టర్‌లు వేసే (పోస్టర్‌లు అలానే వేశాం అని ఆయనే చెప్పారు) నాగవంశీ కూడా మాట్లాడటం లేదు. అంతలా సినిమా దెబ్బడిపోయింది. ఇది విశ్వక్ కెరీర్‌కి చాలా ఇబ్బంది. దీంతో తనకు అచ్చొచ్చే యాంగ్రీ యంగ్ మ్యాన్ గెటప్‌లోకి విశ్వక్ తిరిగి వెళ్లడం కరెక్ట్ అని విశ్లేషకుల అంచనా.
ఆ జోన్‌లో చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’ లాంటి కథలు ఇప్పుడు ఎంచుకోవాలి అనే సూచనలు వినిపిస్తున్నాయి. వీటిలో మొదటి సినిమాకు సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఇప్పుడు రెడీ అవుతోంది. ‘ఫలక్‌నుమా దాస్’ సీక్వెల్ చేయాలి అంటే అది విశ్వక్ ప్రోడక్ట్.. ఆయనే ఆలోచించాలి. ఇక ‘హిట్ ’ అంటే నాని చెప్పాలి. నాలుగో ‘హిట్’ కార్తి చేయాల్సి ఉంది. అదెప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఆ తర్వాత ఐదో ‘హిట్’లో విశ్వక్ ఉంటాడో లేదో చూడాలి.
అన్నట్లు నాని దగ్గరకు వెళ్లకుండానే ఇప్పుడు చేస్తున్న ‘లెగసీ’, ‘కల్ట్’ యాక్షన్, యాంగ్రీ జోన్‌లోనే ఉన్నాయి. కాబట్టి విశ్వక్ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిట్ బొమ్మ వాటితో పడుతుందేమో చూడాలి.