‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ ఇక సినిమాలు చేయడు.. మొత్తం పాలిటిక్స్‌లోనే ఉంటాడు అని వార్తలొచ్చాయి. దీంతో ఆయన సినిమా ఫ్యాన్స్ చిన్నగా హర్టయ్యారు. అయితే ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్‌లో ‘నేను సినిమాలు చేస్తా’ అని చెప్పి అందరి నోట చెక్కెర పోశాడు. అయితే ఇప్పటివరకు ‘ఉస్తాద్..’ తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనేది చెప్పలేదు. దీంతో రోజుకో పుకారు పుట్టుకొస్తోంది. ఆ లెక్కన పవన్ సినిమా అంటూ పెద్ద లిస్టే తయారవుతోంది. అందులో ఏది అవ్వొచ్చు, దేనికి ఎక్కువ ఛాన్స్ ఉందో చూద్దాం.
ఈ లిస్ట్ గురించి చెప్పే ముందు తొలుత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఎప్పుడొస్తుంది అనేది చూడాలి. ఇప్పటివరకు సినిమా టీమ్ అయితే ఎక్కడా అఫీషియల్‌గా, అన్ అఫీషియల్‌గా ఈ విషయం చెప్పడం లేదు. పవన్ కల్యాణ్ అయితే తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసేశాడు. ఇతర యాక్టర్ల సీన్స్, ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను తీసుకురావొచ్చు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. అసలు ఈ సినిమా షూటింగ్ అవుతున్నట్లు సమాచారం కూడా లేదు.
ఇక పవన్ లైనప్ గురించి చూస్తే.. రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి సినిమాను చాలా ఏళ్ల క్రితమే అనౌన్స్ చేశారు. ఈ సినిమానే నెక్స్ట్ అని దాదాపు సమాచారం. అయితే మధ్యలో త్రివిక్రమ్ మరో ప్రపోజల్‌తో వచ్చారని సమాచారం. ‘బ్రో’ సినిమా తీసిన సముద్రఖనితో ఓ సినిమాను చేయించే ఏర్పాట్లలో ఉన్నారని సమాచారం. దానికి రచనా సహకారంలో త్రివిక్రమ్ అందిస్తారని టాక్. ఈ రెండూ కాకుండా దిల్ రాజు నిర్మాణంలో పవన్ ఓ సినిమా చేస్తానని గతంలోనే మాటిచ్చారట. దాని కోసం ఆయన కథను ఓకే చేసేపనిలో ఉన్నారు.
మొన్నీమధ్య వరకు ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి పేరు వినిపించగా.. ఇప్పుడు వంశీ పైడిపల్లి పేరు వినిపిస్తోంది. మాస్, యాక్షన్ సినిమాలకు ఆయన ఫేమస్. మాస్ యాక్షన్ హీరోను ఆయన చూపించే విధానం అదిరిపోతుంది. దానికి ఓ మెసేజ్ యాడ్ చేసి పవన్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. ఇవిలా ఉండగా ‘ఓజీ 2’ సినిమాకు పవన్ ఓకే చెప్పారు. అయితే ఇది ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మిగిలిన నాలుగు సినిమాల్లోనే ఒకటి అవుతుంది.