భయపడేవాడు ఒకడుగు వెనక్కి వేస్తాడు… భయపెట్టేవాడు ఒకడుగు ముందుకు వేస్తాడు! ఈ మాట ఎవరో చెప్పింది కాదు.. చిన్నప్పటి నుండి మనం సమాజం చూసి నేర్చుకుంది. ప్రతి ఒక్కరూ ఈ స్టెప్ ఏదో ఒక సమయంలో చేసే ఉంటారు. అయితే జరిగింది ఇలా ఉంటే… దానికి ఇంకోలా అన్వయించుకుంటే… ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఇదే జరుగుతోంది అని అంటున్నారు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్. కారణం ‘డంకీ’ వర్సెస్ ‘సలార్’ అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.
సెప్టెంబరు నెలాఖరులో రావాల్సిన ‘సలార్’ అనుకోని పరిస్థితుల్లో మూడు నెలలు వాయిదా పడి డిసెంబరు మూడోవారానికి వాయిదా పడింది. చాలా పుకార్ల తర్వాత ఈ సినిమాను డిసెంబరు 22న తీసుకొస్తామని టీమ్ ప్రకటించింది. దీంతో ఆ డేట్ను అప్పటికే లాక్ చేసుకున్న చాలా సినిమాలు డేట్స్ మార్చుకున్నాయి. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ – రాజ్ కుమార్ హిరానీల ‘డంకీ’ కూడా వాయిదా పడుతుంది, వాయిదా వేసేశారు అంటూ ఓ చర్చ మొదలైంది.
అనుకున్నట్లే సినిమా డేట్ను అయితే ‘డంకీ’ మార్చుకుంది. అయితే ‘సలార్’కు ఒక్క రోజు ముందే తీసుకొస్తున్నారు. దీంతో ‘సలార్’ తాకిడిని తట్టుకోలేక ‘డంకీ’ డేట్ మార్చుకుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. దీంతో ఆ పోస్టుల కింద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భయపడితే వెనక్కి వెళ్తాడు కానీ… ఒక రోజు ముందుకు రాడు కదా అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే రోజు రెండు సినిమాల క్లాష్ ఎందుకుని ‘డంకీ’ ముందుకొచ్చాడు అని అంటున్నారు.
మరికొందరు అయితే రెండు పెద్ద సినిమాల క్లాష్ ఎప్పుడూ బాగుంటుంది. దానిని అలానే జరగనివ్వండి. ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం. అంతేకానీ ఇలా లేనిపోని కామెంట్లు చేసి వాతావరణాన్ని వేడెక్కించొద్దు అని అంటున్నారు. అసలు సంగతి ఏంటో క్రిస్మస్కి కానీ మనకు తెలియదు. ఆల్ ది బెస్ట్ టు (Dunki, Salaar) ‘డంకీ’ అండ్ ‘సలార్’ అని మాత్రం మనం చెప్పొచ్చు.