ఎస్.ఎస్.లలిత్ కుమార్ - జగదీష్ పళనిస్వామి (Producer)
అనిరుధ్ (Music)
మనోజ్ పరమహంస (Cinematography)
Release Date : అక్టోబర్ 19, 2023
“మాస్టర్, బీస్ట్, వారసుడు” లాంటి యావరేజ్ సినిమాల తర్వాత విజయ్ నటించిన తాజా చిత్రం “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద “LCU” కారణంగా భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. మరి లోకేష్ ఈ సినిమాకి తన మునుపటి సినిమాలైన “విక్రమ్, ఖైధీ”లతో ఏమైనా లింక్ చేశాడా లేదా? ఇంతకీ ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో ఉందా లేదా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. సమీక్ష చదవాల్సిందే..!!
కథ: హిమాచల్ ప్రదేశ్ లోని ఓ మూల గ్రామంలో ఒక కేఫ్ నడుపుతూ ఫ్యామిలీతో సరదాగా బ్రతికేస్తుంటాడు పార్తిబన్ (విజయ్). ఒక సందర్భంలో కొందరు గ్యాంగ్ మెంబర్స్ కెఫేలో తన కూతుర్ని మరియు అక్కడ పని చేసే మహిళను చంపేస్తామని బెదిరించడంతో.. వేరే దారి లేక ఆ గ్యాంగ్ మెంబర్స్ అందర్నీ చంపేస్తాడు పార్తిబన్. దాంతో అతడి ప్రపంచం తలక్రిందులవుతుంది.
యాంటోనీ దాస్ (సంజయ్ దత్) & హరోల్డ్ దాస్ (అర్జున్)లు అనుకోని విధంగా పార్తిబన్ ప్రపంచంలోకి వస్తారు. ఈ పార్తిబన్ కనబడకుండాపోయిన తమ ఫ్యామిలీ మెంబర్ లియో దాస్ అని వాళ్ళ నమ్మకం. దాంతో.. పార్తిబన్ ను విపరీత పద్ధతుల్లో టెస్ట్ చేస్తుంటారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? పార్తిబన్ జీవితం మళ్ళీ మామూలైందా? ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఎవరు గెలిచారు అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: విజయ్ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని కొందరు తమిళ ప్రేక్షకులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు కానీ.. విజయ్ ఈమధ్యకాలంలో ఇంత వీక్ పెర్ఫార్మెన్స్ ఎన్నడూ చేయలేదు. ముఖ్యంగా గ్యాంగ్ మెంబర్స్ ను హతమార్చి ఏడ్చేసే సన్నివేశంలో విజయ్ తేలిపోయాడు. చాలా ఫోర్స్ద్ ఉంటుంది ఆ సన్నివేశంలో నటన. మరీ ముఖ్యంగా స్టైలింగ్ పెద్ద మైనస్ అయ్యింది. పార్తిబన్ పాత్ర విగ్ ఏమాత్రం సెట్ అవ్వలేదు. లియోగా మాత్రం ఎప్పట్లానే ఒదిగిపోయి నటించాడు. అలాగే.. డ్యాన్స్ & ఫైట్స్ తో తన ఫ్యాన్స్ ను అలరించాడు. త్రిషకు మంచి పాత్ర లభించింది. నటిగా ఆ పాత్రకు న్యాయం చేసింది కూడా.
సంజయ్ దత్ & అర్జున్ ల పాత్రలకు ఇంట్రడక్షన్ సీన్స్ లో ఉన్న సత్తా క్యారెక్టర్స్ లో లేదు. అందువల్ల.. వాళ్ళ భారీ ఎలివేషన్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి. సినిమాలో అందరికంటే ఎక్కువగా అప్లాజ్ వచ్చింది మాత్రం “ఖైధీ” చిత్రంలో నెపోలియన్ గా అలరించిన జార్జ్ కి మాత్రమే అని చెప్పాలి. గౌతమ్ మీనన్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: నిజానికి ఒక లోకేష్ కనగరాజ్ మార్క్ సినిమాగా చూస్తే “లియో” ఆకట్టుకుంటుంది. కానీ.. ఈ సినిమాని “LCU”లో ఇరికించడానికి చేసిన ప్రయత్నమే బెడిసికొట్టింది. విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడం, ఆ యూనివర్స్ లోని యాక్టర్స్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆడియన్స్ మరీ ఎక్కువగా వెయిట్ చేయడం సినిమాకి మైనస్ గా మారింది. ఈ నిరాశలోనూ తనదైన శైలి యాక్షన్ బ్లాక్స్ తో ఆకట్టుకున్నాడు లోకేష్. నిజానికి ఈ తరహా యాక్షన్ సీన్స్ కేవలం లోకేష్ సినిమాలో మాత్రమే చూడగలం. సో, దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్న లోకేష్.. కథకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఈ చిత్రం “ఎ హిస్టరి ఆఫ్ వయొలెన్స్”కు రీమేక్ అవ్వడం మరో మైనస్ గా మారింది.
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ & అనిరుధ్ సంగీతం మాత్రం సినిమాకి పెద్ద ప్లస్. మనోజ్ తన ఫ్రేమ్స్ తో సినిమాలోని ఎలివేషన్స్ & ఎమోషన్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేస్తే.. అనిరుధ్ తన నేపధ్య సంగీతంతో ఆ ఎలివేషన్స్ & ఎమోషన్స్ కు మంచి పీక్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ లేకపోతే సినిమాను చూడలేకపోయేవాళ్లం. సీజీ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ అన్నీ నిర్మాతలు ఎక్కడా వెనుకాడలేదు అని ప్రూవ్ చేశాయి.
విశ్లేషణ: “LCU” హైప్ ను పక్కన పెట్టి చూస్తే “లియో” (LEO) మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్న మాస్ మసాలా సినిమా. అనిరుధ్ నేపధ్య సంగీతం కోసమైనా ఈ సినిమాను ఒకసారి చూడాల్సిందే. యాక్షన్ బ్లాక్స్, కెమెరా వర్క్, టెక్నికాలిటీస్ అన్నీ చక్కగా వర్కవుటైనా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సరిగా వర్కవుటవ్వకపోవడం, కథగా ఎగ్జైట్ చేసే అంశాలు లేకపోవడంతో “లియో” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.