“వీరసింహారెడ్డి” హిట్ అవ్వడంతో మంచి హైలో బాలయ్య నటించిన తాజా చిత్రం “భగవంత్ కేసరి”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు నమోదయ్యేలా చేశాయి. తెలంగాణ యాసలో బాలయ్య డైలాగులు, ఆయన వయసుకి తగ్గట్లు గెటప్ కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. మరి బాలయ్యకు మరో బ్లాక్ బస్టర్ ను అనిల్ రావిపూడి అందించగలిగాడా? అనేది చూద్దాం..!!
కథ: నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ).. పోలీసు అడవిబిడ్డ. భీంసేరిలో జరిపిన మారణహోమం అనంతరం జైలుకెళ్లి.. అక్కడ పరిచయమైన జైలర్ (శరత్ కుమార్) యాక్సిడెంట్ లో చనిపోగా.. ఆయన కూతురు విజయలక్ష్మి అలియాస్ విజ్జి (శ్రీలీల)ను సొంత బిడ్డలా సాకుతాడు భగవంత్. ఒకానొక సందర్భంలో.. రాష్ట్రంలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్ రాహుల్ సాంగ్వి (అర్జున్ రాంపాల్)తో తలపడాల్సిన వస్తుంది.
అసలు రాహుల్ సాంగ్వికి ఓ సాధారణ వ్యక్తి అయిన భగవంత్ తో ఎందుకు తలపడాల్సి వచ్చింది ? ఆ మహాపోరాటం నుంచి భగవంత్ తన ప్రాణానికి ప్రాణమైన విజ్జిని భగవంత్ ఎలా కాపాడుకున్నాడు ? వంటి ప్రశ్నలకు సమాధానాలు ‘భగవంత్ కేసరి’ సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
నటీనటుల పనితీరు: చానాళ్ళ తర్వాత బాలయ్య తన వయసుకు సరిపోయే పాత్రలో కనిపించాడు. వయసు కవర్ చేయకుండా.. మాస్ పవర్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో సెటిల్డ్ గా చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. అనిల్ రావిపూడి చెబుతున్నట్లు ఒక కొత్త బాలయ్యను చూస్తాం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్లాష్ బ్యాక్ మాత్రం పెద్దగా వర్కవుటవ్వలేదు. మరీ ఎలివేషన్ కోసం ఇరికించినట్లుగా అయ్యింది.
శ్రీలీల సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్. మొన్నటివరకూ ఆమెకు పెర్ఫార్మెన్స్ రాదు అని గేలి చేసివారందరి నోర్లకు ప్లాస్టర్ వేసింది. ముఖ్యంగా సెకండాఫ్ లో శ్రీలీల నటన, క్లైమాక్స్ లో మాస్ ఎలివేషన్ తో అదరగొట్టింది. ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ గా నిలిచింది. కాజల్ కి పెద్దగా ఆకట్టుకొనే స్థాయి పాత్ర లభించలేదు. లుక్స్ విషయంలోనూ కాస్త నిరాశపరిచింది. అర్జున్ రాంపాల్ రెగ్యులర్ విలన్ గా పర్వాలేదనిపించుకున్నాడు. మురళీధర్ గౌడ్, రఘుబాబుల కామెడీ టైమింగ్ అలరిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు: బోయపాటి తర్వాత బాలయ్యను అంత బ్యాలెన్స్డ్ గా చూపించిన ఘనత అనిల్ రావిపూడికి దక్కుతుంది. చాలా నేచురల్ గా, ఎక్కడ బాలయ్య తరహా అతి లేకుండా ఒక సరికొత్త కమర్షియల్ హీరోలా ప్రెజంట్ చేసాడు అనిల్. కామెడీ జోనర్ మాత్రమే డీల్ చేయగలడు అనేవారికి ఈ సినిమాతో మంచి సమాధానం చెప్పాడు అనిల్. అలాగే.. సమాజానికి అవసరమైన సందేశాన్ని కూడా ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఇవ్వడం అనేది మెచ్చుకోదగిన విషయం. మరీ ముఖ్యంగా “చైల్డ్ ఎబ్యుజ్”ను పిల్లలు ఎలా ఎదుర్కోవాలి అని ఒక కమర్షియల్ హీరోతో చెప్పించడం అనేది ప్రశంసార్హం. ఈ తరహా సందేశాలకు మాస్ సినిమాల ద్వారా మంచి రీచ్ ఉంటుంది.
“ఎఫ్ 3″తో తనపై పడిన మచ్చను “భగవంత్ కేసరి”తో పోగొట్టుకున్నాడు అనిల్ రావిపూడి. రోత కామెడీ కంటే క్లాస్ యాక్షన్ బాగా హ్యాండిల్ చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్ గా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను స్లోమోషన్స్ తో కాకుండా.. స్ట్రాంగ్ ఫ్రేమ్స్ తో ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అలాగే.. యాక్షన్ బ్లాక్స్ ను కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది. బి,సి సెంటర్ ఆడియన్స్ కు ఈ ఫైట్స్ పండగ అనే చెప్పాలి.
తమన్ ఈ సినిమాకి సెకండ్ హీరోలా నిలిచాడు. పాటలు ఓ మోస్తరుగా ఉన్నా.. నేపధ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోసాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆయువుపట్టులా నిలిచింది అనే చెప్పాలి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగుంది. కమర్షియల్ సినిమాల్లో ఈ స్థాయి డీటెయిలింగ్ ఉండడం అనేది మంచి విషయం. కాకపోతే.. సీజీ వర్క్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. అంత ఖర్చు చేసి.. చాలా చోట్ల గ్రాఫిక్స్ విషయంలో దొరికిపోయారు మేకర్స్.
విశ్లేషణ: బాలయ్య అభిమానులు మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పూర్తిస్థాయిలో సంతుష్టులు అవ్వదగిన కమర్షియల్ యాక్షన్ డ్రామా “భగవంత్ కేసరి”. అనిల్ రావిపూడి కొత్తరకం టేకింగ్, బాలయ్య సరికొత్త మాస్, శ్రీలీల పెర్ఫార్మెన్స్ & తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఈ చిత్రాన్ని (Bhagavanth Kesari 0తప్పకుండా చూడొచ్చు. ఇక ఎలివేషన్స్ & ఫైట్స్ కోసమైతే రెండుమూడుసార్లు చూసినా తప్పు లేదు.