‘వార్ 2’ చాలా పెద్ద సినిమా.. ‘వార్ 2’ సినిమా టార్గెట్ కూడా చాలా పెద్దది.. ఇక తెలుగులో ఈ సినిమాకు రిలీజ్ నిర్మాత నాగవంశీ కూడా చాలా పెద్ద టార్గెట్.. ఇంత పెద్ద టార్గెట్ ఉన్న సినిమాకు ఎలాంటి ప్రచారం జరగాలి. ఎలాంటి ప్రచారం జరుగుతోంది అనేది చూస్తే.. ఆ స్థాయి ప్రచారం జరగలేదు అని మాత్రం అర్థమవుతోంది. సినిమా రిలీజ్ ఒక రోజు ఉంది.. ఇప్పుడెందుకు ఈ చర్చ అని అనుకుంటున్నారా? ఈ రోజు కూడా టీమ్ ఈ పని చేయకపోతే ఎలా అనేదే ఇక్కడ కన్సర్న్.
‘వార్ 2’ సినిమాకు భారీ కాస్టింగ్ ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ కియారా అడ్వాణీతో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన సినిమా ఇది. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి సినిమా తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ తెరకెక్కించింది. దీంతో ఈ సినిమాకు ఊహించని రీతిలో ప్రచారం చేస్తారు అనుకున్నారు. ఓ ‘బాహుబలి’, ఓ ‘ఆర్‌ఆర్‌ఆర్’, ఓ ‘పుష్ప’.. కనీసం ఓ ‘హరి హర వీరమల్లు’ స్థాయిలో ప్రచారం ఉంటుందేమో అనుకున్నారు.
కానీ తెలుగులో ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ పెట్టి మ..మ అనిపించారు. తారక్, హృతిక్ ఏమన్నా ఇంటర్వ్యూలో ఇస్తారేమో అవి రిలీజ్‌కి ముందు మంచి హైప్‌ను తీసుకొస్తాయేమో అనుకున్నారంతా. కనీసం గ్రూపు ఇంటర్వ్యూ అయినా పెడతారేమో అనుకున్నారు. కానీ చూస్తుంటే ఇప్పటివరకు ఏమీ రాలేదు. కేవలం ఎక్స్ పోస్టులు పెట్టి ఊరుకుంటున్నారు. సినిమా పనుల్లో ఏమన్నా బిజీగా ఉన్నారేమో అంటే ఎప్పుడో ఫైనల్ డిస్క్ రెడీ అయిపోయింది. బాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇదంతా చూస్తేంటే సినిమాకు ఈ ప్రచారం చాలు అనుకున్నారా? అవసరం లేదనుకున్నారా అనేది అర్థం కావడం లేదు.