ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల నంది అవార్డుల ప్రకటన అనంతరం .. ప్రధానంగా గుణశేఖర్, అక్కినేని, మెగా హీరోలకు అన్యాయం జరిగిందని మీడియాలో సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ఆరోపించారు. సింగిల్ గా పోరాడుతున్న గుణశేఖర్ ని కాసేపు పక్కన పెడితే.. అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు మాత్రం నంది అవార్డ్స్ పై ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అలాగే ఇప్పటి వరకు మెగా కుటుంబానికి చెందిన వారు మీడియా ముందుకు వచ్చి అవార్డులను ఆహ్వానిస్తున్నట్టు గానీ వ్యతిరేకిస్తున్నట్టు గానీ చెప్పలేదు. మెగా కుటుంబసభ్యులు వెనుక నుంచి నల్లమలుపు బుజ్జి, బన్నీవాసు, బండ్ల గణేష్ తదితరులను రెచ్చ కొడుతున్నారనే వాదన ఉంది.
ఇప్పటి వరకు వెనక నుంచి నడిపించారు సరే .. అవార్డుల కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. ఎందుకంటే మెగా హీరోల్లో ఎవరికీ ఉత్తమనటుడిగా అవార్డు ఇవ్వకపోయినా చిరంజీవికి “రఘుపతి వెంకయ్య అవార్డు”కు ఎంపిక చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఉత్తమ పురస్కారాల్లో ఇది ఒకటి. ఇక రేసుగుర్రం, రుద్రమదేవికి చిత్రాల్లో నటనకు ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వక పోయినా అల్లు అర్జున్ కి అలనాటి మహానటుడు ఎస్వీయార్ అవార్డుకు ఎంపిక చేశారు. సో ఈ ఇంత రచ్చ కారణమైన వారు అవార్డును తీసుకుంటారా? లేక కార్యక్రమానికి వెళ్లకుండా నిరసనను వ్యక్తం చేస్తారా? ఏది చేసినా ఇబ్బంది పడాల్సిందే.
ఎందుకంటే అవార్డు తీసుకుంటే .. తమ కోసం మీడియా ముందు ప్రశించిన వారు హార్ట్ అవుతారు. తీసుకోకపోతే మహానుభావుల అవార్డులను తిరస్కరించి వారిని అవమానించిన వారవుతారు. ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం ఆలోచిస్తారో చూడాలి.