నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నారా రోహిత్. ప్రస్తుత పరిస్థితులకు భిన్నంగా వరుసగా సినిమాలు చేస్తూ ఈ ఏడాది ప్రథమార్థంలోనే నెలన్నర వ్యవధిలో మూడు సినిమాలు థియేటర్లలోకి పంపాడు. అయితే అవి అదే స్పీడ్ తో వెనుదిరిగాయి. మళ్ళీ నాలుగు నెలల తర్వాత శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో తెరమీదికొస్తున్నాడు రోహిత్. అయితే ప్రస్తుత విషయం ఈ సినిమా గురించి కాదు.
తమిళ సినిమా ‘మౌన గురు’ ఆధారంగా రోహిత్ ‘శంకర’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఏళ్ల వాయిదా తర్వాత ఈ నెల 16న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఒరిజినల్ సినిమాతో పాటు మురుగదాస్ హిందీలో రీమేక్ చేసిన ‘అఖిరా’ విజయం సాధించాయి. ఇక్కడా అదే ఫలితం వస్తుందో లేదో చూడాలి. డిలే అయినప్పటికీ రోహిత్ నటించిన రెండు సినిమాలు వారం వ్యవధిలో విడుదలవుతుండటం విశేషం. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా సైతం ఈ సంవత్సరంలోనే విడుదల కానుంది.