2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాపుల మద్దతు ఏకపక్షంగా రావడానికి కారణమైంది పవన్ కళ్యాణే అని రాజకీయ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. ఒకవేళ అప్పటి ఎన్నికల్లో పవన్ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలపకపోయి ఉంటే… వైసీపీకి మరికొన్ని సీట్లు లభించి ఫలితాలు మరోలా ఉండేవని విశ్లేషిస్తుంటారు. ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు తెలిపిన పవన్.. ఆ తరువాత మాత్రం కాపుల కోసం చొరవ తీసుకున్న సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి.
పవన్ తనకు తాను కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోకపోయినా… ఆ సామాజికవర్గం నేతలు మాత్రం పవన్ తమవాడే అని పదే పదే చెబుతుంటారు. అయితే తాజాగా ముద్రగడ దీక్ష సందర్భంగా మిగతా కాపు నాయకులంతా తమకు మద్దతుగా నిలిచిన… పవన్ మాత్రం దూరంగా ఉండటాన్ని కాపు సామాజికవర్గానికి చెందిన చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారట.
ఈ విషయంలో ఆయన చంద్రబాబుకు మద్దతు తెలిపారని కొందరు టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లో పవన్ కు మద్దతు తెలిపే అంశంలో కాపు నేతలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కు కాపుల మద్దతు ఉంటుందో లేదో అనేది డౌటే!