‘సలార్’ (Salaar) , ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాల బ్లాక్‌బస్టర్ విజయాలతో మాంచి జోరు మీదున్నాడు ప్రభాస్ (Prabhas) . ఈ నేపథ్యంలో తర్వాత వచ్చే సినిమాల విషయంలో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ‘బాహుబలి’ (Baahubali) సినిమాల తర్వాత మళ్లీ ఇప్పుడే హిట్ ట్రాక్‌లో ఉన్నాడు కాబట్టి. దీని కోసం కొంతమంది అభిమానులు మళ్లీ పాన్ ఇండియా సినిమాలే రావాలి అంటున్నారు. ఎందుకంటే ఇన్‌స్టంట్‌గా రెండు సీక్వెల్స్ ఉన్నాయి మరి. అయితే ప్రభాస్ ప్లానింగ్ చూస్తుంటే అలా లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సీక్వెల్స్, పాన్ ఇండియా సినిమా పక్కన పెట్టి సగటు టాలీవుడ్ సినిమాలు చేస్తున్నాడు.
ఒకటి ఫ్యాన్ ఇండియా కాగా.. రెండో సంగతి ఈ రోజో, రేపో తెలిసిపోతుంది. వచ్చే సమ్మర్‌లో ‘రాజాసాబ్’ (The Rajasaab) అంటూ ఫ్యాన్ ఇండియా సినిమా చేయనుండగా.. హను రాఘవపూడి (Hanu Raghavapudi) – మైత్రీ మూవీ మేకర్స్ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది అని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలు పారలల్‌గా షూటింగ్ జరుపుకుంటాయట. దీంతో ఆ స్థాయి విజయం ఈ సినిమాలతో అవుతుందా? అనే ప్రశ్న మొదలైంది.
మామూలుగా అయితే ప్రభాస్ స్వింగ్‌లో ఉన్నప్పుడు ఏ సినిమా వచ్చినా పాన్ ఇండియానే. ఎందుకంటే ఆయన ఇమేజ్ అలాంటిది. అయితే మరి ఆ పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అనేదే ఇక్కడ ప్రశ్న. అన్నట్లు హను సినిమా పాన్ ఇండియానే అంటున్నారు అనుకోండి. అయితే అది ట్రైలర్ వచ్చాక బజ్ బట్టి తెలుస్తుంది. ‘సలార్ 2’ ఈపాటికే మొదలవ్వాలి. కానీ ఎందుకో కానీ స్టార్ట్ చేయలేదు.
ఇక ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో రూమర్లు కూడా రావడం లేదు. ఇక సందీప్ రెడ్డి వంగా సినిమా వచ్చే ఏడాదిలో కానీ, ఈ ఏడాది ఆఖరులో కానీ ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. ఈ లెక్కన ఆ సినిమాలు రావడానికి చాలా కాలమే పడుతుంది. కాబట్టి ఇప్పటికి ఈ సినిమాలతో అడ్జెస్ట్ అయిపోవడమే.