మన దగ్గర పెద్ద హీరో, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి సినిమాలు వచ్చినప్పుడు అదనపు షో కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు నిర్మాతలు వెళ్తుంటారు. వాటిని పరిశీలించి ప్రభుత్వాలు నిర్ణయం వెలువరిస్తుంటాయి. మ్యాగ్జిమమ్ తొలి వారంతంలోనే ఈ అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ప్రతి సినిమాకు నిర్మాతలు లేదా పంపిణీదారులు ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందే. ఈ సమస్య ఎక్కువగా సింగిల్ స్క్రీన్లకే. మల్టీప్లెక్స్‌ల్లో షోలు వేసేస్తుంటారు.
ఈ సమస్య యథాతథంగా లేకపోయినా తమిళ సినిమా పరిశ్రమలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రముఖ నటుడు విజయ్ జోసెఫ్ తమిళనాడు సీఎం అయ్యాక ఈ విషయంలో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. తమిళ సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం సాయం చేయండి అంటూ పలువురు కోలీవుడ్ ప్రముఖులు కోరిన నేపథ్యమో లేక తన ఆలోచనో కానీ.. ఇండస్ట్రీ కోసం ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడులో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమా ఐదు షోలను ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చారు. మొదటి వారం వరకు ఈ అనుమతి అమలులో ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అడుగు పడింది అని తమిళ సినిమా వర్గాలు చెబుతున్నారు. ఇప్పుడు ఎలాంటి అదనపు అనుమతులు అక్కర్లేకుండానే, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యజమాన్యం కలసి అదనపు షోలను ప్రదర్శించుకోవచ్చు.