ఏ సినిమాకైనా స్ట్రాంగ్ క్లైమాక్స్ ముఖ్యం. సినిమా అంతా బాగుండి… క్లైమాక్స్ సరిగ్గా కుదరక బేర్మన్న సినిమాలు చాలానే చూశాం మనం. అలాంటిది ఇయర్ ఎండింగ్ కూడా అలానే ఉండాలి. అందులోనూ సినిమాల విషయంలో కాబట్టి స్ట్రాంగ్ క్లైమాక్స్ పక్కాగా ఉండాలి. ఇప్పుడు 2021కి ఎలాంటి క్లైమాక్స్ ఇస్తారనేది చర్చగా మారింది. వచ్చే నెల నుండి టాలీవుడ్లో పెద్ద సినిమాల పండగ మొదలుకానుంది. మరి ఆ సినిమాలు ఏం చేస్తాయో చూడాలి.
సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం మనం చూశాం. అయితే డేట్స్ అడ్జస్ట్మెంట్లో భాగంగా డిసెంబరులోనే చాలా పెద్ద హీరోల సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు పక్కాగా రిలీజ్ డేట్లు తేలిన సినిమాలు చూస్తే వరుణ్‌తేజ్ ‘గని’ డిసెంబరు 3న, అల్లు అర్జున్ – సుకుమార్ ‘పుష్ప – 1’ డిసెంబరు 17న, ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబరు 24న విడుదల చేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని కుర్ర హీరోల సినిమాలున్నాయి.
దీంతో ఈ ఏడాది డిసెంబరు ఆసక్తికరంగా మారింది. ఈ సంవత్సరంలో తొలి అర్ధభాగం కరోనా తినేసింది. దీంతో వసూళ్ల వాసన మనకు సెకండాఫ్‌లోనే తెలిసింది. అయితే అది కూడా కొంతే. ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి డిసెంబరులో వచ్చే సినిమాలకు మంచి స్పందన వస్తుంది అనుకుంటున్నారు. ఈ సినిమాల ప్రదర్శన బాగుంటే… వచ్చే ఏడాది బాక్సాఫీసు హుషారుగా ఉంటుంది. కాబట్టి స్ట్రాండ్ ఎండింగ్ అండ్ బూస్టింగ్ వీరి చేతుల్లోనే ఉంది.