ఒకప్పుడు సినిమా తీయడానికి బడ్జెట్ లేకపోతేనో, సినిమా తీసే ఎక్స్ పీరియన్స్ లేకపోతేనో షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్ తీసేవారు. కానీ.. ఈమధ్యకాలంలో మన సినిమాలకంటే అద్భుతమైన కంటెంట్ తో షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే.. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చిన డిజిటల్ విప్లవాన్ని కొందరు దర్శకులు చెత్త ప్రయోగాలకు వాడుకొని తమ డైరెక్టర్ ఈగోని సాటిస్ఫై చేసుకొంటున్నారు కానీ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ లేదా ఎంగేజ్ మాత్రం చేయలేకపోతున్నారు. ఈమధ్య వెబ్ సిరీస్ లలో కంటెంట్ తక్కువ బూతులు ఎక్కువ అయిపోయాయి. ఏమైనా అంటే అనురాగ్ కశ్యప్ తీసిన “సేక్రెడ్ గేమ్స్”లో బూతులు ఉన్నాయి కదా అని వాదించే బ్యాచ్ ఎక్కువైపోయింది.
ఈమధ్య అమేజాన్ ప్రైమ్ లో రెండు వెబ్ సిరీస్ లు విడుదలయ్యాయి. ఒకటి మీర్జాపూర్, రెండోది తెల్లరాజు. ఈ రెండు వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. కానీ.. ఈ రెండు సిరీస్ లలో అనవసరమైన బూతులు మాత్రం కోకొల్లలు. సిరీస్ మొత్తంలో అలరించే అంశం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోయినా మాస్ ఆడియన్స్ సైతం ఈసడించుకొనే స్థాయి ఛండాలమైన బూతులు మాత్రం పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఫిలిమ్ మేకర్స్ వాళ్ళకు దొరికిన బంగారం లాంటి అవకాశాల్ని ఇలా పెర్వర్షన్ చూపించుకోవడానికి వినియోగించుకొంటుండడం బాధాకరం.