War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • హృతిక్ రోషన్, ఎన్టీఆర్ (Hero)
  • కియారా అద్వానీ (Heroine)
  • అనిల్ కపూర్, అశుతోష్ రాణా (Cast)
  • అయాన్ ముఖర్జీ (Director)
  • ఆదిత్య చోప్రా (Producer)
  • ప్రీతమ్- సంచిత్ - అంకిత్ (Music)
  • బెంజమిన్ జాస్పర్ (Cinematography)
  • ఆరిఫ్ షేక్ (Editor)
  • Release Date : ఆగస్ట్ 14, 2025
  • యష్ రాజ్ ఫిలిమ్స్ (Banner)

2019 లో విడుదలైన “వార్”కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆరేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ రిలీజ్ కానుండడం, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హిందీ డెబ్యూ అవ్వడంతో “వార్ 2” (War 2) మీద చాలా అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

War 2 Review in Telugu

కథ: రోగ్ ఏజెంట్ గా మారిన కబీర్ (Hrithik Roshan) ఫ్రీలాన్సర్ గా మారిపోయి వరుస అసాసినేషన్స్ చేస్తూ ఇండియన్ ఏజెన్సీకి సవాల్ గా మారతాడు. ఒకానొక సందర్భంలో ఏకంగా రా చీఫ్ లూత్రా (అశుతోష్ రాణా)ను చంపేయడంతో.. కబీర్ ను ఎలాగైనా కంట్రోల్ చేయాలీ అనే ధ్యేయంతో విక్రమ్ (ఎన్టీఆర్)ను రంగంలోకి దిగుతుంది.

కబీర్ వర్సెస్ విక్రమ్ లో ఎవరు గెలిచారు? ఎవరిది పై చేయిగా నిలిచింది? అసలు కలి కార్టెల్ ఎవరు? వాళ్లని కబీర్ ఎలా ఎదిరించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “వార్ 2” చిత్రం.

నటీనటుల పనితీరు: హృతిక్ రోషన్ స్వాగ్ & బాడీ లాంగ్వేజ్ తో కబీర్ పాత్రను పీక్ లెవల్లో ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో మొదటిసారి ఒక రకమైన నెగిటివ్ షేడ్ పండించడానికి ప్రయత్నించాడు. అది వర్కవుట్ అయ్యింది కూడా.

జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివా, పాజిటివా అనేది పక్కన పెడితే స్క్రీన్ ప్రెజన్స్ తో మాత్రం ఆకట్టుకున్నాడు. అయితే.. ఎంట్రీ సీన్ ట్రోల్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. మిగతా సీన్స్ లో మాత్రం తనదైన లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా పండలేదు. వాళ్ల మధ్య బాండింగ్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ.. ఇద్దరూ కొట్టుకుచచ్చేందుకు సరైన కారణం మాత్రం కనిపించలేదు. అందువల్ల యాక్షన్ బ్లాక్ తేలిపోయాయి.

అశుతోష్ రాణా మాత్రం లూత్రా పాత్రకు ప్రాణం పోసేశాడు. అతడి లుక్స్ & బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు గౌరవాన్ని కల్పించాయి.

ఇక కియారా అద్వానీని కేవలం ఒక పాట, రెండు ఫైట్లకు కుదించేశారు. సెకండాఫ్ లో ఒక సందర్భంలో అవును హీరోయిన్ ఉండాలి కదా అనే ఆలోచన కూడా కలుగుతుంది.

అనిల్ కపూర్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

సాంకేతికవర్గం పనితీరు: రచయిత మరియు నిర్మాత ఆదిత్య చోప్రా రాసుకున్న కథలో పట్టు లేదు. చెప్పాలంటే వార్1 & 2కి కథ పరంగా పెద్ద తేడా లేదు. ఇక ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడం కోసం చేసిన తప్పుల కారణంగా కథనంలో వేగం కొరవడింది. ఈ కథను హ్యాండిల్ చేయడానికి అయాన్ ముఖర్జీ కూడా చాలా కష్టపడ్డాడు. ఇద్దరు మాస్ హీరోల ఇమేజ్ కు తగ్గట్లుగా కొన్ని యాక్షన్ బ్లాక్స్ రాసుకున్నప్పటికీ, వాటిని తెరకెక్కించిన విధానం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఫైనల్ ఫేసాఫ్ యాక్షన్ బ్లాక్ చాలా పేలవంగా ఉంటుంది. అక్కడ ఎమోషన్ కూడా సరిగా పండలేదు. దర్శకరచయితలు ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ ను ఆడియన్స్ కు అందించడంలో విఫలమయ్యారు అనే చెప్పాలి.

ప్రీతం-సంచిత్-అంకిత్ త్రయం అందించిన పాటలు హిందీ వెర్షన్ లో ఎలా ఉన్నాయో తెలియదు కానీ.. తెలుగులో మాత్రం ఏమాత్రం అలరించలేకపోయాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటివి బాగున్నా.. సీజీ వర్క్ మాత్రం సినిమా రేంజ్ కి తగ్గట్లుగా లేకపోవడం మైనస్. చాలా చోట్ల సీజీ వర్క్ తేలిపోయింది. మేకర్స్ ఆ విషయంలో ఎందుకని లైట్ తీసుకున్నారో మరి.

విశ్లేషణ: సినిమాల్లో లాజిక్కులు వెతకడం తప్పే అయినప్పటికీ.. మరీ విడ్డూరంగా అనిపించే స్థాయి యాక్షన్ బ్లాక్ ను ఆస్వాదించడం కూడా కష్టమే. అలాగే.. డ్రామా అనేది సినిమాని ఆడియన్స్ కు కనెక్ట్ చేసేలా ఉండాలి కానీ.. ఎందుకొచ్చింది అన్నట్లుగా కాదు. ఈ రెండు విషయాల్లో మేకర్స్ కేర్ తీసుకోకపోవడంతో “వార్ 2” (War 2) ఓ యావరేజ్ ఎంటర్టైనర్ గా మిగిలిపోయింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి టవరింగ్ పెర్ఫార్మెన్సులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక, కథనంతో ప్రేక్షకుల్ని అలరించలేక మేకర్స్ చాలా ఇబ్బందిపడ్డారు. లాంగ్ వీకెండ్ కావడం, లాజిక్కులు పట్టించుకోకుండా సినిమా చూసే ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు కాస్త ఉండడం అనేది “వార్ 2”కి ప్లస్ పాయింట్.

ఫోకస్ పాయింట్: అరకొరగానే అలరించిన యుద్ధం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus