స్త్రీ ప్రధాన సినిమాలు, సిరీస్ లు తెలుగులో చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి ఒక సిరీస్ “కానిస్టేబుల్ కనకం”. వర్ష బొల్లమ్మ టైటిల్ పాత్ర పోషించిన ఈ సిరీస్ రిలీజ్ కి ముందే కాపీరైట్ ఇష్యూతో హల్ చల్ చేసింది. ఈ సిరీస్ నేడు (ఆగస్ట్ 14) ఈటీవీ విన్ లో విడుదలైంది. 6 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!
కథ: శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె అనే గ్రామంలో ఉన్న ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ కి ఏకైక లేడీ కానిస్టేబుల్ గా డ్యూటీలో చేరుతుంది కనకమహాలక్ష్మి (వర్ష బొల్లమ్మ).
కట్ చేస్తే.. ప్రతి పౌర్ణమికి రేపల్లెలోని ఆడపిల్లలు అదృశ్యమవుతూ ఉంటారు. ఆ విధంగా కనపడకుండాపోయిన చంద్రిక (మేఘలేఖ)ను వెతకడం మొదలుపెడుతుంది కనకమహాలక్ష్మి.
అలా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన కనకానికి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి.
అసలు రేపల్లెలోని ఆడపిల్లలకు ఏం జరుగుతుంది? వాళ్లు ఎలా మాయమవుతున్నారు? దాని వెనుక ఎవరు ఉన్నారు? దాన్ని కనకం ఎలా ఛేదించింది? అందుకోసం ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “కానిస్టేబుల్ కనకం” వెబ్ సిరీస్.
నటీనటుల పనితీరు: సిరీస్ మొత్తం వర్ష బొల్లమ్మ పోషించిన కనకమహాలక్ష్మి చుట్టూనే తిరుగుతుంది. బేలతనాన్ని, నిస్సహాయతను, ధైర్యాన్ని చాలా సహజంగా ప్రదర్శించింది. ఆ ఎమోషన్స్ ను ఆమె పండించిన విధానం కూడా బాగుంది. అయితే.. ఆమె ఎందుకని అంత భయస్తురాలు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.
రాజీవ్ కనకాల, రమణ భార్గవ్, ప్రేమ్ సాగర్ లు సహాయ పాత్రల్లో మంచి సపోర్ట్ అందించారు.
శ్రీనివాస్ అవసరాల తనదైన శైలి పెర్ఫార్మెన్స్ తో మరోసారి సిరీస్ కి ప్లస్ పాయింట్ గా నిలిచారు.
సాంకేతికవర్గం పనితీరు: సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఎమోషన్ ను, ట్విస్టులను చాలా బాగా ఎలివేట్ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో కంటెంట్ లేకపోయినా తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయడానికి విశ్వప్రయత్నం చేశాడు.
శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది కానీ కొన్ని రిపీటెడ్ షాట్స్ బోర్ కొట్టిస్తాయి. ప్రొడక్షన్ టీమ్ బాగానే మ్యానేజ్ చేశారు. ఆర్ట్ & కాస్ట్యూమ్ కూడా పర్వాలేదు అనిపించాయి.
దర్శకుడు ప్రశాంత్ రాసుకున్న మూలకథ బాగున్నప్పటికీ.. కథనంలో ఆసక్తి లోపించింది. 3 ఎపిసోడ్ల వరకు అసలు ఎందుకు అంతలా సాగుతుందో అర్థం కాదు. ముఖ్యంగా మరీ ఎక్కువ క్యారెక్టర్స్ రాసేయడంతో, అక్కడక్కడా అవి ఆసక్తి కలిగించినా, చివరికి వచ్చేసరికి మాత్రం అవన్నీ అవసరం లేదేమో అనిపిస్తుంది. 6 ఎపిసోడ్ల సిరీస్ లో 3 ఎపిసోడ్లు బోర్ కొట్టడం అనేది అంత మంచిది కాదు. అయితే.. 6వ ఎపిసోడ్ లో అవసరాల శ్రీనివాస్ పాత్రను ట్రాన్స్ఫార్మ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. వర్ష బొల్లమ్మ పాత్రను కూడా ఒక భయస్తురాలి నుండి మహంకాళిగా మారిన తీరు బాగుంది. ఇలాంటి క్యారెక్టర్ ఆర్క్స్ వరకు పర్వాలేదనిపించుకున్నాడు ప్రశాంత్. ఓవరాల్ గా.. బొటాబొటి మార్కులతో నెట్టుకొచ్చాడు ప్రశాంత్.
విశ్లేషణ: వెబ్ సిరీస్ లకు, అందులోనూ థ్రిల్లర్స్ కి యాంటిసిపేషన్ అనేది చాలా కీలకం. అది క్రియేట్ చేయడంలోనే “కానిస్టేబుల్ కనకం” ఫెయిల్ అయినప్పుడు, ఈ సిరీస్ ను కేవలం నేపథ్య సంగీతం కోసం రెండుసార్లు చూస్తారు అని స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అనవసరం. ఇది చాలా సాదాసీదా సిరీస్. ఆకట్టుకునే అంశాలు చాలా తక్కువ. కేవలం పెర్ఫార్మెన్సులు మరియు చివరి రెండు ఎపిసోడ్స్ తో మాత్రమే నెగ్గుకొచ్చారు అని చెప్పాలి. అయితే సెకండ్ సీజన్ కి ఇచ్చిన లీడ్ డీసెంట్ గానే ఉంది. మరి మొదటి సీజన్ లో దొర్లిన తప్పులు సెకండ్ సీజన్ కి కరెక్ట్ చేసుకుంటారేమో చూడాలి.
ఫోకస్ పాయింట్: ఇది సరిపోదు కనకం!
రేటింగ్: 2/5