శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్.. హిందీ సినిమాలతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల్లో కూడా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. గత ఏడాది వచ్చిన ‘దేవర’ తో టాలీవుడ్ కి డెబ్యూ ఇచ్చింది జాన్వీ. ఆ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అటు తర్వాత రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. కొన్నాళ్ళుగా జాన్వీ కపూర్ కి హిందీలో సరైన సక్సెస్ లేదు. అక్కడ తన మార్కెట్ స్టాండర్డ్ గా ఉండాలంటే ఓ సాలిడ్ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాల్సిన సిట్యుయేషన్లో ఉంది జాన్వీ.
ఈ సమయంలో ఆమె నుండి ‘పరమ్ సుందరి’ అనే సినిమా రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలో హీరోగా నటించారు. తుషార్ జలోటా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జాన్వీ సౌత్ కి చెందిన అమ్మాయి.. ఇంకా చెప్పాలంటే కేరళకు చెందిన సుందరి దామోదరం పిళ్లై అనే పాత్రలో కనిపించనుంది. ఇక సిద్దార్థ్ మల్హోత్రా నార్త్ కి చెందిన అంటే ఢిల్లీకి చెందిన అబ్బాయి పరమ్ సచ్‌దేవ్‌గా కనిపించనున్నాడు. ట్రైలర్లో ‘తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కేరళ-మలయాళం మోహన్ లాల్, ఆంధ్ర-తెలుగు అల్లు అర్జున్, కర్ణాటక-కన్నడ యష్’ అంటూ పలికిన డైలాగ్ వల్ల సౌత్ ఆడియన్స్ దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
ఆల్రెడీ ముంబైకి చెందిన కొంతమంది సినీ ప్రముఖులకు ఈ చిత్రాన్ని చూపించారట తుషార్ జలోటా, నిర్మాత దినేష్. సినిమాలో హ్యూమర్ బాగా వర్కౌట్ అయ్యింది అని చెబుతున్నారు. జాన్వీ నటన బాగుందని, కేరళ అమ్మాయిగా ఆమె లుక్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఎమోషనల్ సన్నివేశాల్లో జాన్వీతో పాటు సిద్దార్థ్ కూడా బాగా చేశారని, సచిన్ – జిగర్ మ్యూజిక్ అన్నీ ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. మరి ఆగస్టు 29న రిలీజ్ అయ్యే ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.